భారతదేశపు చిట్ట చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా..? రెండు సముద్రాల మధ్య కిర్రాక్ జర్నీ.. లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాల్సిందే

భారతదేశం చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా..? రెండు వైపులా సముద్రం గర్జిస్తుంటే.. హాయిగా సాగే ఆ ప్రయాణం కేవలం ఒక రోడ్డు ప్రయాణం మాత్రమే కాదు.. అది చరిత్ర, పురాణం, ప్రకృతి కలగలిసిన ఒక అద్భుతం. అన్వేషకులను, యాత్రికులను దశాబ్దాలుగా ఆకర్షిస్తున్న ఆ చివరి రోడ్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశపు చిట్ట చివరి రోడ్డు ఎక్కడుందో తెలుసా..? రెండు సముద్రాల మధ్య కిర్రాక్ జర్నీ.. లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాల్సిందే
Which Is The Last Road Of India

Updated on: Mar 06, 2026 | 12:09 PM

సాధారణంగా మనం ప్రయాణించే రోడ్లు ఏదో ఒక ఊరికో లేదా నగరానికో చేరుస్తాయి. కానీ దేశంలో ఒక రోడ్డు మాత్రం నేరుగా సముద్రం మధ్యలోకి తీసుకెళ్తుంది. అక్కడితో ఆ రోడ్డు ముగిసిపోతుంది. అదే తమిళనాడులోని ధనుష్కోడి నుంచి అరిచల్ మునై వరకు సాగే జాతీయ రహదారి 87. దీనినే భారతదేశపు చివరి రోడ్డు అని పిలుస్తారు. ఈ రోడ్డుపై ప్రయాణం ఒక అద్భుతంలా ఉంటుంది. మీరు ఈ రోడ్డుపై వెళ్తుంటే.. మీ ఎడమ వైపున బంగాళాఖాతం, కుడి వైపున హిందూ మహాసముద్రం కనిపిస్తాయి. రెండు సముద్రాల మధ్యలో వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ రోడ్డు ముగిసే చోట నిలబడి చూస్తే.. కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే శ్రీలంక సముద్ర సరిహద్దు ఉంటుంది. ఆకాశం క్లియర్‌గా ఉంటే శ్రీలంక తీరం కూడా ఇక్కడి నుంచి కనిపిస్తుంది.

పురాణాల్లో దీని ప్రాముఖ్యత

ధనుష్కోడి అంటే విల్లు చివర అని అర్థం. పురాణాల ప్రకారం.. శ్రీరాముడు లంకకు వెళ్లేందుకు రామసేతు నిర్మించాలనుకున్నప్పుడు.. తన విల్లుతో ఈ ప్రదేశాన్ని సూచించాడని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశానికి ఆధ్యాత్మికంగా ఎంతో గౌరవం ఉంది.

దెయ్యాల పట్టణంగా ఎలా మారింది?

ఒకప్పుడు ధనుష్కోడి చాలా అందమైన పట్టణం. అక్కడ రైల్వే స్టేషన్, పోస్టాఫీసు, ప్రజలు ఉండేవారు. కానీ 1964లో వచ్చిన ఒక భయంకరమైన తుఫాను ఈ పట్టణాన్ని అతలాకుతలం చేసింది. ఆ ధాటికి రైల్వే లైన్ కొట్టుకుపోయింది. , ఊరు ఊరంతా సముద్రంలో కలిసిపోయింది. అప్పటి నుంచి ప్రభుత్వం ఇక్కడ ఎవరూ ఉండకూడదని ప్రకటించింది. నేటికీ అక్కడ మిగిలి ఉన్న పాత భవనాల శిథిలాలు ఆనాటి విషాదాన్ని మనకు గుర్తు చేస్తాయి.

ప్రయాణికులకు స్వర్గధామం

గతంలో ఈ ప్రాంతానికి వెళ్లడం కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఆధునిక రోడ్డును నిర్మించడంతో పర్యాటకులు తమ సొంత కార్లు లేదా బైక్‌లపై చివరి పాయింట్ వరకు వెళ్లవచ్చు. సముద్రపు గాలిని ఆస్వాదిస్తూ, ప్రకృతి అందాలను చూడాలనుకునే వారికి ఇది ఒక స్వర్గధామం. మీరు ఎప్పుడైనా రామేశ్వరం వెళ్తే ఈ చివరి రోడ్డుపై ప్రయాణించడం మర్చిపోవద్దు. దేశం అంచున నిలబడి ఆ అనంతమైన సముద్రాన్ని చూడటం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిన అనుభూతి.

Follow Us