
మనం నిత్యం చూసే టీవీ స్క్రీన్లు, సినిమా థియేటర్లలోని తెరలు ఎప్పుడూ దీర్ఘచతురస్రాకారంలోనే (Rectangle) ఎందుకుంటాయి? వాటిని గుండ్రంగా లేదా త్రిభుజాకారంలో ఎందుకు తయారు చేయరు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీకు వచ్చిందా? దీని వెనుక కేవలం డిజైన్ మాత్రమే కాదు, టెక్నాలజీ, హ్యూమన్ సైకాలజీ.. మనం చూసే కంటెంట్ వంటి అనేక బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
1950, 60 దశకాల్లో వచ్చిన పాత సీఆర్టీ (CRT) టీవీలను చూస్తే అవి గుండ్రంగా ఉన్నట్లు అనిపిస్తాయి. అయితే వాటి డిస్ప్లే పూర్తిగా గుండ్రంగా ఉండదు. కేవలం అంచులు మాత్రమే వంపుగా (Curved) ఉండేవి. లోపల ప్రదర్శించే చిత్రం మాత్రం ఎప్పుడూ దీర్ఘచతురస్రాకారంలోనే సాగేది. కాలక్రమేణా టెక్నాలజీ మారుతూ వచ్చి LCD, LED, OLED ప్యానెళ్లు అందుబాటులోకి రావడంతో ఫ్లాట్ స్క్రీన్లు తెరపైకి వచ్చాయి.
అయితే మనం చూసే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, వార్తలు అన్నీ ఒక నిర్దిష్ట నిష్పత్తి (Aspect Ratio) ఆధారంగా రూపుదిద్దుకుంటాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టీవీలన్నీ ఎక్కువగా 16:9 నిష్పత్తిలో వస్తున్నాయి. అంటే స్క్రీన్ వెడల్పు 16 భాగాలుగా ఉంటే, ఎత్తు 9 భాగాలుగా ఉంటుంది. ఒకవేళ టీవీని గుండ్రంగా లేదా త్రిభుజాకారంలో తయారు చేస్తే.. వీడియోలోని నాలుగు మూలలు కట్ అయిపోయి, ముఖ్యమైన దృశ్యాలు కనిపించకుండా పోతాయి. అందుకే రెక్టాంగిల్ షేప్ సరైన ఎంపికైందని తెలియజేస్తున్నారు.
అంతే కాకుండా మానవ కంటి నిర్మాణం కూడా వెడల్పుగా ఉన్న దృశ్యాలను స్పష్టంగా గ్రహించడానికి వీలుగా ఉంటుంది. అలానే తయారీ ఖర్చులను తగ్గించుకోవడానికి.. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటెంట్‌ను అందించడానికి డిస్ప్లే తయారీదారులు దీర్ఘచతురస్రాకార డిజైన్‌నే ప్రామాణికంగా ఎంచుకున్నట్టు స్పష్టం చేస్తున్నారు. అందుకే టెక్నాలజీ ఎంత మారినా టీవీల ఆకారం మాత్రం మారలేదని క్లారిటీ ఇస్తున్నారు.
మనం చూసే సినిమాలు, వీడియోలన్నీ ఒక పద్ధతి ప్రకారం 16:9 సైజులో ఉంటాయి. అంటే వెడల్పు కొంచెం ఎక్కువగా, ఎత్తు తక్కువగా ఉండేలా షూట్ చేస్తారు. ఒకవేళ టీవీ గనుక గుండ్రంగా ఉంటే.. ఆ వీడియో సరిగ్గా పట్టదు. మూలల్లో ఉన్న ముఖ్యమైన దృశ్యాలు, మనుషుల ముఖాలు కట్ అయిపోతాయి. అదే దీర్ఘచతురస్రం అయితే వీడియో ఎలాంటి అడ్డులేకుండా క్లియర్‌గా కనిపిస్తుంది. అంతే కాకుండా టీవీలను గోడకు తగిలించాలన్నా, ఇంట్లో ఒక మూలన సెట్ చేయాలన్నా ఈ షేప్ చాలా కన్వీనియెంట్గా ఉంటుందని వివరిస్తున్నారు.