
సముద్రంలో పుట్టి సూర్యుని కిరణాలతో స్పటికంగా మారే అద్భుతమే ఉప్పు అని చెప్పవచ్చు. తన రూపాన్ని కరిగించుకుని మరీ వంటకానికి పరిపూర్ణతను అందిస్తూ.. ఆకలి తీర్చే ప్రతి మెతుకులోనూ తన ఉనికిని చాటుకుంటుంది. మన పెద్దల మాటల్లో చెప్పాలంటే తీపికి గర్వమెక్కువ, కారానికి కోపమెక్కువ.. కానీ ఉప్పుకు మాత్రమే ఒదిగి ఉండే గుణమెక్కువ. ఈ మాటలు కేవలం అక్షరాలకే పరిమితం అనుకుంటే ఒకసారి వంటలో ఉప్పు వేయకుండా వండితే.. ఆటోమేటిక్ గా మీరే నిజంమని ఒప్పుకుంటారు. అందుకే విశ్వాసానికి ప్రతీకగా ఉప్పును అభివర్ణిస్తూ.. మీ ఉప్పు తిన్న విశ్వాసం ఉందని చెబుతుంటారు.
కాగా మన వంటింట్లో ఉప్పుకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని రకాల మసాలాలు వేసినా, ఎంత రుచిగా వంట చేసినా అందులో సరైన మోతాదులో ఉప్పు లేకపోతే ఆ వంటకం రుచించదు. అందుకే ఉప్పును ప్రతి ఇంట్లో నిత్యం ఉపయోగిస్తుంటారు. సాధారణంగా కిరాణా దుకాణాల్లో రూ.20 నుంచి రూ.50కే కిలో ఉప్పు కొనుగోలు చేస్తుంటాం. కానీ ప్రపంచంలో కొన్ని రకాల ఉప్పు ధర మాత్రం వింటేనే ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి వాటిలో దక్షిణ కొరియాకు చెందిన ‘జుక్యోమ్’ (Jukyeom) ఒకటి. దీనినే కొరియన్ వెదురు ఉప్పు (Korean Bamboo Salt) అని పిలుస్తారు. మన వాడుక భాషలో చెప్పాలంటే ఈ బొంగులో ఉప్పు ధర తెలిస్తే ఖచ్చితంగా.. ఏం మాట్లాడుతున్నారు.. నరాలు కట్ అయిపోతున్నాయ్ అంటూ అవాక్కవుతారు. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం..
ఈ ఉప్పు ప్రత్యేకత దాని తయారీ విధానంలోనే ఉందని చెబుతున్నారు. సాధారణంగా సముద్రపు నీటిని ఆవిరి చేసి ఉప్పును తయారు చేస్తారు. కానీ కొరియన్ వెదురు ఉప్పు తయారీ అలా ఉండదంటున్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయ పద్ధతిలో దీన్ని తయారు చేస్తున్నట్టు వివరిస్తున్నారు. ముందుగా సహజమైన సముద్రపు ఉప్పును వెదురు కర్రల్లోనింపి.. ఆ తర్వాత వెదురు ముక్కల చివరలను ఖనిజాలు కలిగిన బంకమట్టితో మూసివేస్తారు. వీటిని కట్టెల మంటపై అధిక ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. అయితే దీనిని ఒకసారి కాల్చి తయారు చేయరని.. అదే ఉప్పును మళ్లీ మళ్లీ ఎనిమిది సార్లు కాల్చిన తర్వాత తొమ్మిదోసారి అత్యంత అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారని తెలుపుతున్నారు.
ఇక చివరి దశలో భాగంగా ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుందని.. ఒక్కోసారి కాల్చిన తర్వాత వెదురు, మట్టి అవశేషాలను తొలగించి, మిగిలిన ఉప్పును మళ్లీ కొత్త వెదురు కర్రల్లో నింపుతారని క్లారిటీ ఇస్తున్నారు. ఇలా చేయడానికి చాలా సమయం, శ్రమ అవసరమవుతుందని చెప్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి ఉప్పు రంగు, ఆకృతి కూడా మారతాయని.. అందుకే కొన్నిసార్లు ఈ వెదురు ఉప్పు ఊదా రంగులో కూడా కనిపిస్తుందని స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత నాణ్యమైన ఈ వెదురు ఉప్పు కిలో ధర సుమారు 347 డాలర్ల వరకు ఉంటుందని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.30 వేల వరకు ఉంటుంది. అయితే తయారీ విధానం, నాణ్యత, బ్రాండ్‌ను బట్టి ధర మారుతుందని కూడా అంటున్నారు.
కొరియాలో వెదురు ఉప్పుకు వంటింటితో పాటు సంప్రదాయ వైద్యంలోనూ ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయని చెబుతారు. అలానే సంప్రదాయ వైద్యంలో జీర్ణ సమస్యలు, నోటి ఆరోగ్యం వంటి అవసరాలకు కూడా ఉపయోగించిన చరిత్ర ఉందని గుర్తు చేస్తున్నారు. అయితే ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని కాబట్టి దీనిని ఔషధంగా భావించి ఉపయోగించడం సరికాదని కోరుతున్నారు.
ఇక ఈ వెదురు ఉప్పును సాధారణ వంట ఉప్పులాగే ఆహారంలో ఉపయోగించవచ్చని తెలిజేస్తున్నారు. అయితే దీని ధర ఎక్కువగా ఉండటంతో చాలామంది ప్రత్యేక వంటకాల్లో మాత్రమే వాడతారని.. లేదా వంట చివర్లో కొద్దిగా చల్లి రుచి కోసం ఉపయోగిస్తారని వ్యాఖ్యానిస్తున్నారు.