Taj Mahal: తాజ్ మహల్‌‌లో చెత్తా చెదారం శుభ్రం చేసిన విదేశీ వనిత.. దేశ ప్రతిష్టకు భంగమా..?

|

Nov 18, 2023 | 6:11 PM

ఓ విదేశీ మహిళ తాజ్ మహల్‌ను శుభ్రం చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనంటూ సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. విదేశీ మహిళ తాజ్ మహల్‌ను శుభ్రం చేయాల్సిన దుస్థితిని కలిగించి కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశం పరువు తీసిందంటూ ఆయన ఆరోపించారు. గతంలో చీపురు పట్టుకుని లక్నో వీధుల్లో హడావుడి చేసిన వారు ఇప్పుడు ఎక్కడపోయారంటూ ప్రశ్నించారు.

Taj Mahal: తాజ్ మహల్‌‌లో చెత్తా చెదారం శుభ్రం చేసిన విదేశీ వనిత.. దేశ ప్రతిష్టకు భంగమా..?
Taj Mahal
Follow us on

తాజ్ మహల్ అందాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. ఇది తాజ్ మహల్, ఆగ్రా నగరంతో పాటు దేశంలో పర్యాటక రంగ పురోభివృద్ధికి దోహదపడుతోంది. తాజ్ మహల్ అందాలను ప్రపంచ పర్యాటకులు, ప్రముఖులు పలువురు మెచ్చుకుంటున్నా.. ఇక్కడ కాలుష్యం, పరిశుభ్రత మీద తరచూ విమర్శలు వస్తున్నాయి. ఆగ్రా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన పరిశ్రమల కారణంగా తాజ్ మహల్ పాలరాతి శోభను కోల్పోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పక్కనే ఉన్న యమునా నది కాలుష్యం గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ లోపల కూడా పరిశుభ్రత లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.  తాజాగా ఓ విదేశీ పర్యాటకురాలు తాజ్ మహల్ సందర్శనకు వెళ్లారు. అక్కడి  ప్రధాన సమాధిలపై పడి ఉన్న చెత్తాచెదారం, షూ కవర్లను తొలగించాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ సిబ్బందికి ఆమె సూచించారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో స్వయంగా ఆమె రంగంలోకి దిగి వాటిని శుభ్రం చేశారు. దీంతో తాజ్ మహల్ దగ్గర ఏఎస్ఐ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై రాజకీయ వివాదం రాజుకుంది.

ఓ విదేశీ మహిళ తాజ్ మహల్‌ను శుభ్రం చేయడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనంటూ సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. విదేశీ మహిళ తాజ్ మహల్‌ను శుభ్రం చేయాల్సిన దుస్థితిని కలిగించి కేంద్రంలోని బీజేపీ సర్కారు దేశం పరువు తీసిందంటూ ఆయన ఆరోపించారు. గతంలో చీపురు పట్టుకుని లక్నో వీధుల్లో హడావుడి చేసిన వారు ఇప్పుడు ఎక్కడపోయారంటూ ప్రశ్నించారు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్ట పెరిగిందని మోదీ సర్కారు ప్రచారం చేసుకుంటోందని.. అయితే ఈ ఘటన వాస్తవ పరిస్థితికి అద్దంపడుతోందని వ్యాఖ్యానించారు. తాజ్ మహల్‌లో పారిశుధ్య వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

అయితే తాజ్ మహల్‌ పరిశుభ్రతపై వస్తున్న విమర్శలను ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ రాజ్‌కు‌మార్ పటేల్ తోసి‌పుచ్చారు పర్యటకురాలు పబ్లిసిటీ స్టంట్ కోసం ఉద్దేశపూర్వకంగా అక్కడ క్లీన్ చేస్తున్నట్లు ఫొటోలు, వీడియో తీశాడని తెలిపారు. తాజ్‌మహల్‌లోని పలు చోట్ల డస్ట్‌బిన్‌లను ఉంచి సిబ్బందితో శుభ్రతను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఫ్లోర్ క్లీనింగ్ తదితరాలను ప్రతి రోజూ చాలాసార్లు చేపడుతున్నట్లు తెలిపారు. తాజ్ మహల్‌లో పరిశుభ్రతను పట్టించుకోవడం లేదని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదన్నారు.