Seema Chintakayalu
Health Tips: సీమ చింతకాయలు.. గ్రామాల్లో చాలామందికి ఈ కాయల గురించి తెలిసే ఉంటుంది. వీటిని పల్లెటూర్లలో గుబ్బ కాయలు లేదా గుబ్బణాలు అని కూడా అంటారు. మనీలా టామరిండ్, మద్రాస్ టోర్న్, డెవిల్స్ నెక్లస్, జంగిల్ జలేబి అనే పేర్లతో కూడా పిలుస్తారు. సిటీల్లో ఉండేవాళ్లలో చాలామందికి ఈ కాయల గురించి తెలియదు. పచ్చిగా ఉన్నప్పుడు తింటే ఇవి వగరుగా అనిపిస్తాయి. పండిన తర్వాత తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి. కాయలు పంటకు వచ్చినప్పుడు పైన తొక్క విడిపోతుంది. ఈ చెట్లు వేప చెట్లు, తుమ్మ చెట్లు అంత ఎత్తు పెరుగుతాయి. కొమ్మలకు ముళ్లు ఉంటాయి. నీటిశాతం ఎక్కువగా ఉండే సీమచింతలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఊర్లు వెళ్తుంటే రోడ్ల పక్కన ఈ చెట్లు కనిపిస్తాయి. మధుమేహ రోగులకు సీమ చింత వల్ల చాలా ఉపయోగం ఉంటుంది.
- ఈ కాయలలో క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, విటమిన్ సిలు పుష్కలంగా ఉంటాయి.
- సీమ చింతకాయల లో పీచు పదార్థాలు ఎక్కువగా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి
- సీమ చింతకాయలలో ఉండే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం అనేక రకాల వైరస్ బారిన పడకుండా రక్షిస్తుంది
- వీటిలో ఫైటో కెమికల్స్ ఉండడం వల్ల మధుమేహులకు ఉపయోగం ఉంటుంది. డయాబెటిక్ లక్షణాలను తగ్గేలా చేస్తుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.
- సీమచింతకాయల ఆకులలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని పలు పరిశోధనల్లో తేలింది. ఆ ఆకుల్లోని గుణాలు రొమ్ము క్యాన్సర్ నివారించడంలో, క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా అడ్డుకోవడానికి తోడ్పడతాయి
- గర్భిణీ స్త్రీలకు సీమ చింత మంచి పోషకాలను ఇస్తుంది. నీరసం తగ్గిస్తుంది
- ఈ కాయల్లో ఉండే ఫైబర్ గర్భిణీ స్త్రీలలో మలబద్ధకాన్ని నివారిస్తుంది
- ఈ కాయలు కాలేయానికి ఎంతో మంచి చేస్తాయి. కాలేయం పనితీరును మెరుగుపరచడంతో పాటూ, హానికరమైన టాక్సిన్లను నిర్మూలిస్తాయి
- యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంటాయి సీమ చింతకాయలు. ఈ గుణాలు ప్రేగులోని సమస్యలను ప్రభావవంతంగా ఎదుర్కొంటుంది.
గమనిక: ఈ వార్త కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ప్రచురించబడింది. మీకు ఏమైనా అనుమానాలు ఉండే పౌష్ఠికాహార నిపుణులు, డాక్టర్ల సలహా తీసుకోండి..