ఏపీ ప్రజలకు హ్యాపీ న్యూస్.. అక్కడ కరోనా లేదట!

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేశారు అధికారులు. రాష్ట్రంలో కరోనా అనుమానితుల శాంపుల్స్‌ అన్ని నెగిటివ్‌గా వచ్చాయని తెలిపారు. మొత్తం తొమ్మిది శాంపుల్స్‌ని టెస్ట్‌ చేయగా ఎవరికీ కరోనా లేదని..

ఏపీ ప్రజలకు హ్యాపీ న్యూస్.. అక్కడ కరోనా లేదట!
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2020 | 5:55 PM

కరోనా వైరస్‌ ఆంధ్రప్రదేశ్‌లో కలవరం రేపుతోంది. అనుమానితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వం వారి భయాందోళనను పోగొట్టేయత్నం చేస్తూనే రివ్యూ సమావేశాలతో పరిస్థితిని సమీక్షిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేరుగా అధికారులతో సమావేశం అయి.. కరోనా వైరస్‌ నేపథ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు ఇస్తున్నారు.

ఇటీవల కాలంలో విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను ఏపీ ప్రభుత్వం సేకరిస్తోంది. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మార్చి 5 వరకు 6వేల 927 మంది విదేశాల నుంచి రాగా.. వారికి స్క్రీనింగ్‌ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఎయిర్‌పోర్టుల్లోనే కాదు.. నౌకాయానం ద్వారా వచ్చిన వారికి కూడా స్క్రీనింగ్‌ నిర్వహించినప్పటికీ.. రోగ నిరోధానికి ఉన్న అన్ని చర్యలను తీసుకుంటున్నట్టు చెప్పారు.

ఏపీ వ్యాప్తంగా వైద్యసిబ్బంది అలర్ట్‌ చేసింది సర్కార్‌. ముందస్తుగా 351 బెడ్లను సిద్దం చేసింది. 47 వెంటిలేటర్లు, లక్షా 10వేల మాస్కులు, 12వేల 444 పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్లను అందుబాటులో ఉంచారు. మరో 12వేల పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్లను కొత్తగా కొనుగోలు చేయడంతో పాటు అదనంగా 50వేల మాస్కులను కూడా అందుబాటులో ఉంచుతామన్నారు అధికారులు. ఎవరైనా అనుమానిత లక్షణాలుంటే.. కాల్‌ చేస్తే వెంటనే అంబులెన్స్‌ నేరుగా పంపించి ఆసుపత్రికి తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.

ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించేందుకు ప్రభుత్వం అన్నివిధాలు ప్రయత్నిస్తోంది. అంతగా భయపడాల్సిన అవసరం లేదని అంటోంది. 13 మంది అనుమానిత కేసుల్లో 9 నెగిటివ్‌గానే వచ్చాయన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని. కరోనా తీవ్రత లేకుండ చూడడమే కాదు.. ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని మంత్రి ఆళ్ల నాని హామీ ఇస్తున్నారు. అయితే.. ప్రజల్లో భయాందోళనలు మాత్రం తగ్గడం లేదు. విశాఖ, ఒంగోలు, ఏలూరు, విజయవాడ, కాకినాడ, శ్రీకాకుళం, తిరుపతి వంటి ప్రాంతాల్లో కరోనా లక్షణాలతో ఉన్న వారు ఆసుపత్రులకు చేరుతుండడంతో మరింత వణికిపోతున్నారు.

Read More: విశాఖలో సెక్రటేరియట్‌కు స్థలం రెడీ.. సీఎం గ్రీన్ సిగ్నల్!