
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో తనదైన ముద్ర వేసి, మూడు తరాల ప్రేక్షకులను అలరించిన మహానటి పసుపులేటి కన్నాంబ జీవితం, సినీ ప్రస్థానం అద్భుతం. 1912 సెప్టెంబర్ 20న ఏలూరులో ప్రభుత్వ ఉద్యోగి నరసప్పనాయుడు కుమార్తెగా జన్మించిన కన్నాంబ, చిన్నతనం నుంచే కళల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నా, రంగప్రవేశం రోజునే కళాకారుల పట్ల సమాజ వైఖరిని నిరసిస్తూ గజ్జెలు కట్టనని శపథం చేశారు. తన 13వ ఏట ఏలూరులోని నావెల్ నాటక సంఘంలో చేరిన కన్నాంబ, సావిత్రి, అనసూయ, ప్రహ్లాద వంటి నాటకాలతో రంగస్థలంపై అగ్రశ్రేణి నటిగా స్థిరపడ్డారు. ముఖ్యంగా హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతిగా ఆమె కంచుకంఠంతో పాడిన పద్యాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ఆమె నటనా ప్రతిభ సినిమా రంగ దృష్టిని ఆకర్షించింది. 1935లో స్టార్ కంబైన్స్ నిర్మించిన హరిశ్చంద్ర చిత్రంతో కన్నాంబ సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆమె స్టార్‌డమ్ తక్కువ కాలంలోనే వచ్చింది. ఆ తర్వాత ద్రౌపదీ వస్త్రాపహరణం (1936), కనకతార (1937) వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. నటిగా ఆమెకు మంచి రూపం, చక్కని గొంతు, స్పష్టమైన ఉచ్ఛారణ సొంతం. రాగానికి భావాన్ని, భావానికి భావప్రకటనని జోడించి కరుణ రసాన్ని, రౌద్ర రసాన్ని అద్భుతంగా ఆవిష్కరించి మంచి నటి అనిపించుకున్నారు.
కన్నాంబ కేవలం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన భర్త కడారు నాగభూషణంతో కలిసి 1941లో రాజరాజేశ్వరి ఫిలిమ్స్ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్‌పై తల్లి ప్రేమ, సుమతి వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆమె ఆరోగ్యం క్షీణించి రెండేళ్ల విరామం తీసుకున్న తర్వాత, 1945లో మాయాలోకం, మాయా మశ్చీంద్ర, పాదుకా పట్టాభిషేకం వంటి చిత్రాలతో విజయవంతంగా పునరాగమనం చేశారు. నాగయ్య సలహా మేరకు తమిళం నేర్చుకుని, తమిళ చిత్రాలలో కూడా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. నవజీవనం, కన్నకి వంటి చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తయారైన మనోహర చిత్రంలో ఆమె నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు.
ఆమె సాహసాలు సినిమా రంగానికి కొత్త ఒరవడిని సృష్టించాయి. చండిక చిత్రంలో హీరోయిన్ గుర్రపుస్వారీ చేయాల్సి ఉండగా, ఆమె తక్కువ సమయంలోనే నేర్చుకుని నటించారు. దక్షిణాదిన క్రూర జంతువులతో కలిసి నటించిన తొలి నటి కన్నాంబ. చండికలో పులులతో కలిసి నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు, వాటిని స్వయంగా వండి పెట్టి మచ్చిక చేసుకున్నారు. కన్నాంబ వ్యక్తిత్వం గొప్పది. సెట్‌లో చిన్న, పెద్ద తేడా లేకుండా అందరితో ఆప్యాయంగా మాట్లాడేవారు. సినిమా మోజుతో మద్రాసు వచ్చిన ఎంతోమందికి ఆశ్రయం కల్పించి, అన్నం పెట్టి ఆదుకున్నారు. అయితే, తెలుగు చిత్ర పరిశ్రమ ఆమెను తగినంతగా గుర్తించకపోయినా, తమిళ చిత్ర పరిశ్రమ ఆమెను గౌరవించింది. 1960లో కలైమామణి అవార్డుతో సత్కరించింది. 2005లో కన్నాంబ పేరుతో పోస్టల్ స్టాంప్‌ను కూడా విడుదల చేసి, ఆమె పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.
కన్నాంబ, కడారు నాగభూషణం దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఒక అమ్మాయిని దత్తత తీసుకుని, దర్శకుడు సి.ఎస్.రావుకు ఇచ్చి వివాహం చేశారు. అయితే, ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు ఆమెను బాధించాయి. 29 ఏళ్ల నట జీవితంలో తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 200 చిత్రాలలో నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం రామదాసులో కమల పాత్రను దాదాపు పూర్తి చేశారు. 1964 మే 7న, 52వ ఏట కన్నాంబ ఆకస్మికంగా మరణించారు. తెలుగు సినిమా చరిత్రలో మహానటి కన్నాంబ స్థానం అనంతర తరాలకు మార్గదర్శకం.
ఎక్కువమంది చదివినవి : Krishna Vamsi: ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ నాకు ఆ మూవీ నాకు నచ్చలేదు.. కృష్ణవంశీ..