
తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కాలాతీతమైనవి. అవి కేవలం తెరపై కథ చెప్పడమే కాదు, సమాజాన్ని ప్రశ్నిస్తాయి. అలాంటి అపురూప చిత్రాల్లో ఒకటి “మనుషులు మారాలి”. 1969 గాంధీ జయంతి రోజున విడుదలైన ఈ చిత్రం, తన పేరులోనే “మనుషులు ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? మారాల్సింది మనుషులా? సమాజమా?” వంటి లోతైన ప్రశ్నలను సంధించింది. ఆ కాలంలో తెలుగు సినిమా వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా కుటుంబ వ్యవస్థ, ఆర్థిక అసమానతలు, పేదరికం, కుల, వర్గ భేదాలు, మనుషుల మధ్య సంబంధాలు వంటి సామాజికాంశాలను బలంగా చర్చించేది. “మనుషులు మారాలి” కూడా అలాంటి సామాజిక నేపధ్యంతోనే రూపొందింది. దర్శకుడు వి. మధుసూదనరావు సినిమా కథలోని పాత్రల ద్వారా మన సమాజంలో కనిపించే కొన్ని వాస్తవాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. చిత్రంలో అసలు కథ కంటే పాత్రలు ఎదుర్కొనే పరిస్థితులే కథనాన్ని ముందుకు నడిపిస్తాయి. డబ్బు, హోదా, స్వార్థం మనిషికి మనిషికి మధ్య గోడలుగా మారినప్పుడు ఏం జరుగుతుంది, మనిషి ఎదుటి మనిషిని మనిషిగా చూడటం మరచిపోతే కుటుంబం ఎలా ప్రభావితమవుతుంది వంటి ప్రశ్నల చుట్టూ సినిమా భావోద్వేగంగా సాగుతుంది. అందుకే ఈ చిత్రం పేరు కేవలం ఒక టైటిల్ కాదు, అది ఒక పిలుపు.
ఈ సినిమాలో నటీనటుల ప్రదర్శన కథకు బలంగా నిలిచింది. ముఖ్యంగా కుటుంబ భావోద్వేగాలు, సంఘర్షణలు, బాధాకరమైన సందర్భాల్లో నటీనటులు చూపిన సహజమైన నటన చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. దర్శకుడి ఆలోచన సామాజిక సినిమాను తెరకెక్కించేటప్పుడు సందేశాన్ని అందించడంతో పాటు సినిమాను ఆసక్తికరంగా ఉంచాలనే సవాలును వి. మధుసూదనరావు సమర్థంగా ఎదుర్కొన్నారు. కథలోని సంఘటనల ద్వారా ప్రేక్షకులను ఆలోచింపజేయడం ఈ సినిమా ముఖ్య లక్షణం. సినిమా విడుదలైన కాలం, సాంకేతికత, జీవన విధానం మారినా, మనుషుల మధ్య సంబంధాల్లో వచ్చే సమస్యలు మారాయా అనే ప్రశ్న ఈ చిత్రాన్ని నేటికీ గుర్తుంచుకునేలా చేస్తుంది. “మనుషులు మారాలి” మలయాళ చిత్రం “తులాభారం” రీమేక్. ఇది 1968లో విడుదలైన “తులాభారం” (ప్రేమ్ నజీర్ హీరో) నాటకం ఆధారంగా రూపుదిద్దుకుంది. శారదను “ఊర్వశి శారద”గా మార్చిన చిత్రం ఇదే. ప్రపంచ సినీ చరిత్రలో ఒకే కథ ఆధారంగా తీసిన నాలుగు భాషా చిత్రాల్లో (మలయాళంలో “తులాభారం”, తెలుగులో “మనుషులు మారాలి”, తమిళంలో “తులాభారం”, హిందీలో “సమాజ్ కో బదల్ దాలో”) నటించిన ఏకైక నటి శారద కావడం విశేషం. హిందీ వెర్షన్‌కు కూడా మధుసూదనరావే దర్శకుడు. ఈ చిత్రంలో డ్యూయెట్స్, కామెడీ ట్రాక్, ఫైట్స్ లేవు. గుండెలు పిండేసే సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి. పేదరికం కారణంగా కన్న పిల్లలను చంపుకున్న తల్లి కథ ఇది.
విక్టరీ మధుసూదన రావు దర్శకత్వంలో శోభన్ బాబు, శారద జంటగా నటించిన ఈ చిత్రంలో హరనాథ్, కాంచన కీలక పాత్రలు పోషించారు. కే.వి. మహదేవన్ సంగీత సారథ్యంలో “పాపాయి నవ్వాలి పండగే రావాలి”, “తూరుపు సింధూరపు”, “చీకటిలో కారు చీకటిలో” వంటి పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. 1969 అక్టోబర్ 2న విడుదలైన “మనుషులు మారాలి” ఘన విజయం సాధించింది. శోభన్ బాబుకి ఈ సినిమాతోనే స్టార్ హోదా వచ్చింది. విజయవాడలోని శేష్ మహల్ థియేటర్‌లో వరుసగా 100 ఆటలు హౌస్ ఫుల్ అయ్యి రికార్డు సృష్టించింది. శేష్ మహల్‌లో 108 రోజులు, లీలామహల్‌లో 42 రోజులు ఆడింది. ప్రేక్షకుల రద్దీ తట్టుకోలేక ఒక థియేటర్‌లో మగవారికి, మరో థియేటర్‌లో ఆడవారికి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం. చిత్రబృందం 100 రోజుల వేడుకల కోసం విజయవాడ, హైదరాబాద్‌లలో పర్యటించింది. ఎస్.వి. రంగారావు, శోభన్ బాబు, హరనాథ్, నాగభూషణం, శారద, కాంచన, బుల్లిముంత శివరామకృష్ణ, ఆరుద్ర, దాశరథి, శ్రీశ్రీ, కె.వి. మహదేవన్ వంటి ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఎక్కువమంది చదివినవి : Babu Mohan: ఆ పాట చూసి చిరంజీవి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను.. బాబూ మోహన్..