ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. కేవలం స్టార్ హీరో సినిమాలు మాత్రమే కాదు.. కంటెంట్ ఉంటే చాలు చిన్న చిత్రాలకే జనాలు బ్రహ్మారథం పడుతున్నారు. పెద్ద, భారీ బడ్జెట్ సినిమాలకంటే.. కథ, కథనం మెరుగ్గా ఉండి.. అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటున్న సినిమాలను ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఓ సినిమా పేరు అందరి నోటా వినిపిస్తుంది. అదే 12th ఫెయిల్. హిందీలో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సినీ విమర్శకులు, సాధారణ ప్రజలు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. IPS మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్ర పోషించారు. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 12వ తరగతి ఫెయిల్ అయిన అబ్బాయి తనలోని ఆత్మ విశ్వాసాన్ని నింపుకుని విజయాన్ని ఎలా సొంతం చేసుకున్నాడనేదే ఈ సినిమ స్టోరీ. ఇందులో విక్రాంత్ మాస్సే నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్క నటీనటులు సహజ నటనకు విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. గతేడాది నవంబర్ లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ డెవలప్మెంట్ వరకు అన్ని ఏరియాల్లో జనాలను మెప్పించింది. ఇందులో కథానాయికగా శ్రద్ధా జోషి పాత్రను నటించింది మేధా శంకర్. ఇందులో అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్శించింది మేధా. ఇప్పుడు ఈ అమ్మాయి గురించే నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టారు నెటిజన్స్.
1989 ఆగస్ట్ 1న ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జన్మించింది మేధా శంకర్. చిన్నప్పటి నుంచి డాన్స్, పాటలు పాడడం పట్ల ఆమెకు ఆసక్తి ఎక్కువ. చిన్న వయసులోనే వేదికపై ప్రదర్శనలు ఇచ్చింది. మేధా పాఠశాలలో ఉండగానే శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది. సితార్, హార్మోనియం, కీబోర్డ్ వాయించడం నేర్చుకుంది. మేధకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది. కానీ తరువాత, ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెరగడంతో న్యూఢిల్లీలోని ఒక కళాశాలలో ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సు చేసింది. మేధా కాలేజీలో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్ కోసం ఆడిషన్ చేసింది. ఆ తర్వాత ఓ సినిమాలో నటించింది కానీ అది విడుదల కాలేదు. కాలేజీలో ఉన్నప్పుడు మేధా పలు అందాల పోటీల్లో పాల్గొంది. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని 2018లో నోయిడా నుంచి ముంబైకి షిప్ట్ అయ్యింది. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసింది.
కథానాయికగా మారకముందు కొన్ని ప్రకటనలలో నటించింది. 2019లో బిబిసికి చెందిన ‘బీచమ్ హౌస్’ అనే సిరీస్‌లో తొలిసారిగా నటించే అవకాశం వచ్చింది. 2021లో ‘దిల్ బెక్రార్’ అనే రొమాంటిక్ కామెడీ షోలో మేధా నటించారు. అదే ఏడాది ‘దోజ్ ప్రైసీ ఠాకూర్ గర్ల్స్’ అనే వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. మేధా 2021లో విడుదలైన ‘షాదిస్తాన్’ అనే హిందీ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ‘మాక్స్, మిన్.. మియాజాకి చిత్రంలో నటించింది. మూడేళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న మేధాకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ 12th ఫెయిల్ మూవీతో ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఈ బ్యూటీ ఫేమస్ అయ్యింది. 12th ఫెయిల్ సినిమా కంటే ముందు మేధా ఇన్ స్టా ఫాలోవర్స్ 16 వేల మంది మాత్రమే ఉండేవారు. కానీ ఈ మూవీ హిట్ తర్వాత ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్.. 1.8 మిలియన్లకు చేరుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.