సినిమాల జాతకం మాకు ముందే తెలిసిపోతుంది..అలాంటి మూవీస్‌లో కేవలం 40-50 నిమిషాల కథ మాత్రమే ఉంటుంది

సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ సినిమా ఎడిటింగ్ గురించి కీలక అభిప్రాయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రేక్షకుల కోణం నుంచి ఆలోచించడం, వాణిజ్య చిత్రాల కంటే ఫీల్‌గుడ్ సినిమాలను ఎడిట్ చేయడం కష్టం అని ఆయన వివరించారు. ఓటీటీ చిన్న సినిమాలకు అండగా ఉంటుందనుకోవడం తప్పు అని, ప్రస్తుతం పెద్ద సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు

సినిమాల జాతకం మాకు ముందే తెలిసిపోతుంది..అలాంటి మూవీస్‌లో కేవలం 40-50 నిమిషాల కథ మాత్రమే ఉంటుంది
Marthand K Venkatesh

Updated on: Nov 03, 2026 | 7:30 AM

సినీ ప్రపంచంలో ఎడిటింగ్ ఒక కీలకమైన భాగం. ఒక సినిమాకు సరైన రూపం ఇచ్చి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో ఎడిటర్ పాత్ర ఎంతో ఉంటుంది. సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తమ వృత్తిలోని వివిధ అంశాలు, సవాళ్లు, పరిశ్రమలో వస్తున్న మార్పులపై తన లోతైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఒక ఎడిటర్‌గా తాను ఎక్కువగా ప్రేక్షకుడి కోణం నుంచే ఆలోచిస్తానని మార్తాండ్ కె వెంకటేష్ స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దర్శకుడి ఆలోచనతో పాటు, అంతిమంగా సినిమా చూసేది ప్రేక్షకులు కాబట్టి వారి దృష్టికోణం నుంచే కట్ చేస్తానని ఆయన వివరించారు. స్టార్ హీరోల సినిమాల్లో కథను కాపాడుకోవడం, స్టార్ ఇమేజ్‌ను నిలబెట్టుకోవడం అనే ప్రశ్న వచ్చినప్పుడు, ఏ సినిమాకైనా కథే ప్రధానమని, కథ బాగుంటేనే సినిమా నిలబడుతుందని ఆయన గట్టిగా చెప్పారు. అలాగే తన దృష్టిలో,  కమర్షియల్ చిత్రాలను ఎడిట్ చేయడం ఫీల్‌గుడ్ సినిమాలతో పోలిస్తే సులువు. చాలామంది కమర్షియల్ చిత్రాలు కష్టమనుకున్నా అది నిజం కాదని ఆయన అన్నారు. కమర్షియల్ చిత్రాల్లో ఆరు పాటలు, టైటిల్స్‌కు కొంత సమయం, కామెడీ సీన్లు, ఫైట్లు వంటివి చాలా సమయాన్ని తీసుకుంటాయని, కేవలం 40-50 నిమిషాల కథ మాత్రమే ఉంటుందని ఆయన వివరించారు. దీనికి విరుద్ధంగా, ఫీల్‌గుడ్ చిత్రాలకు మాత్రం ఎడిటింగ్ చాలా కష్టం అని వెంకటేష్ తెలిపారు. అలాంటి చిత్రాల్లో భావోద్వేగాలను సినిమా అంతా నిలకడగా, స్మూత్‌గా తీసుకువెళ్లాలని, ఎక్కడ క్లోజ్ షాట్లు, ఎక్కడ వైడ్ షాట్లు పెట్టాలనే దానిపై చాలా శ్రద్ధ వహించాలని ఆయన పేర్కొన్నారు.

ఎడిటింగ్ చేసేటప్పుడు ప్రతి సినిమాకూ తాము భావోద్వేగంగా కనెక్ట్ అవుతామని వెంకటేష్ అన్నారు. ఏడుపు సీన్ అయితే తమ కళ్లల్లో నీళ్లు తిరగాలని, కామెడీ సీన్ అయితే తాము నవ్వాలని, అప్పుడే అది ప్రేక్షకులకు చేరుతుందని ఆయన వివరించారు. రష్ చూసిన వెంటనే, అది ప్రేక్షకులకు ఏ విధంగా కనెక్ట్ అవుతుందో తమకు తెలుస్తుందని ఆయన చెప్పారు. ఎడిటర్‌గా గర్వపడే నిర్ణయం అంటూ ఏదీ ప్రత్యేకంగా లేదని, సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించినప్పుడు అదే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని ఆయన అన్నారు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల రాకతో సినీ పరిశ్రమలో వచ్చిన మార్పులపై మార్తాండ్ కె వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. మొదట్లో ఓటీటీలు చిన్న సినిమాలకు జీవం పోస్తాయని, వాటిని కాపాడతాయని తాను భావించినప్పటికీ, అది పూర్తిగా తప్పు అని నిరూపితమైందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఓటీటీలు పెద్ద సినిమాల కొనుగోలుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చిన్న సినిమాలు పూర్తిగా విస్మరించబడుతున్నాయని ఆయన వివరించారు. చిన్న సినిమాలను ప్రచారం చేయడం చాలా కష్టమని, పదిమందికి ఫోన్ చేసి చెప్పినా చూడటానికి ముందుకు రారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అయితే ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్తే మరుసటి రోజు వచ్చి చూసేవారని, థియేటర్లు, శాటిలైట్ ఛానెల్స్ అండగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు స్టార్ హీరోలు లేని చిన్న సినిమాలను ప్రేక్షకులు థియేటర్లలో చూడటానికి ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. చిన్న, పెద్ద సినిమాల మధ్య ఎడిటర్ల రెమ్యునరేషన్ పరంగా కూడా తేడాలు ఉంటాయని ఆయన అంగీకరించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us