టాలీవుడ్ బాక్సాఫీస్‌ను వణికిస్తున్న కొత్త విలన్.. మెగాస్టార్ సినిమాతో మెప్పించిన మలయాళ నటుడు!

తెలుగు తెరపై విలన్ అంటే ఒకప్పుడు కేవలం ఆరు అడుగుల పొడవు, గంభీరమైన గొంతు ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలకు ధీటుగా పవర్ ఫుల్ బాడీ, మార్షల్ ఆర్ట్స్‌లో పట్టు, విలక్షణమైన మేనరిజమ్స్ ఉన్న నటులకు టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తోంది.

టాలీవుడ్ బాక్సాఫీస్‌ను వణికిస్తున్న కొత్త విలన్.. మెగాస్టార్ సినిమాతో మెప్పించిన మలయాళ నటుడు!
Sudev Nair.jpg

Updated on: Feb 01, 2026 | 8:34 AM

మలయాళ పరిశ్రమ నుంచి ఒక ప్రతిభావంతుడైన నటుడు మన తెలుగు వెండితెరపై తన మార్క్ చూపిస్తున్నారు. గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో తన యాక్టింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆయన.. తాజాగా మెగాస్టార్ సినిమాలో కూడా తనదైన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టారు. అటు జిమ్నాస్టిక్స్‌లో ప్రావీణ్యం, ఇటు నటనలో వైవిధ్యం చూపిస్తున్న ఈ కొత్త విలన్.. అతి త్వరలోనే ఒక పాన్ ఇండియా సినిమాలో యష్‌తో తలపడబోతున్నారు. ఇంతకీ ఎవరా నటుడు? టాలీవుడ్‌లో ఆయన సృష్టిస్తున్న సునామీ ఏంటి?

సుదేవ్ నాయర్ జైత్రయాత్ర..

మలయాళ నటుడు సుదేవ్ నాయర్ ప్రస్తుతం తెలుగులో అద్భుతమైన అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఆయన పోషిస్తున్న పాత్రలు, చూపిస్తున్న విలనిజం సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాది విడుదలైన ‘ఓజీ’ (OG) సినిమాలో సుదేవ్ నాయర్ పోషించిన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి. పవర్ స్టార్ సరసన తనదైన నెగటివ్ షేడ్స్‌తో ఆయన మెప్పించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో సుదేవ్ నాయర్ మరోసారి తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించారు.

డిఫరెంట్ షేడ్స్..

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమాలో సుదేవ్ నాయర్ పోషించిన నెగటివ్ రోల్ అందరినీ అలరిస్తోంది. విమర్శకుల నుంచి కూడా ఆయన నటనకు ప్రశంసలు అందుతున్నాయి. ముఖ్యంగా తన పాత్రలో ఉండే వివిధ రకాల షేడ్స్ ను పండించడంలో సుదేవ్ సక్సెస్ అయ్యారు. జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌లో ఆయనకు ఉన్న ప్రావీణ్యం యాక్షన్ సీక్వెన్స్‌లలో స్పష్టంగా కనిపిస్తోంది. తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ నటనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, త్వరలోనే తన పాత్రలకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా ఆయన సిద్ధమవుతున్నారు.

పాన్ ఇండియా దండయాత్ర..

ప్రస్తుతం సుదేవ్ నాయర్ కెరీర్ అత్యున్నత దశలో ఉంది. కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా రాబోతున్న ‘టాక్సిక్ – ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాలో ఒక ప్రధాన పాత్రను సుదేవ్ నాయర్ పోషిస్తున్నారు. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటున్న సుదేవ్ నాయర్.. రాబోయే రోజుల్లో నెగటివ్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకప్పుడు రఘువరన్, ప్రకాష్ రాజ్ వంటి వారు విలన్ పాత్రలకు ఎలాగైతే ప్రాణం పోశారో, సుదేవ్ కూడా అదే స్థాయిలో రాణిస్తారని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

సుదేవ్ నాయర్ కేవలం రెగ్యులర్ విలన్ పాత్రలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీలో కొత్తదనం ఉండటం వల్ల దర్శకులు కూడా ఆయనకు వైవిధ్యమైన పాత్రలను ఆఫర్ చేస్తున్నారు. మలయాళం నుంచి వచ్చి తెలుగులో ఇంత వేగంగా గుర్తింపు తెచ్చుకోవడం సాధారణ విషయం కాదు. రాబోయే రోజుల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులతో సుదేవ్ నాయర్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. టాలీవుడ్‌కు ఒక పవర్ ఫుల్ విలన్ దొరికాడని సుదేవ్ నాయర్ నటన చూస్తే అర్థమవుతోంది. ‘ఓజీ’ నుంచి మొదలైన ఆయన ప్రయాణం ఇప్పుడు ‘టాక్సిక్’ వరకు చేరింది.