కథలు పడొద్దు..! వయసైపోయిన హీరోతో నటించానన్న రాధిక.. అన్ని తెలిసే ఇప్పుడు నాటకాలా అంటున్న ఫాన్స్

టాలీవుడ్ సినీ ప్రియులకు రాధిక ఆప్టే సుపరిచితమే. నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ మూవీలో కనిపించింది. ఎక్కువగా హిందీలో వరుస సినిమాలు చేసిన ఈ అమ్మడు…. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. టాలీవుడ్ పై ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.

కథలు పడొద్దు..! వయసైపోయిన హీరోతో నటించానన్న రాధిక.. అన్ని తెలిసే ఇప్పుడు నాటకాలా అంటున్న ఫాన్స్
Radhika

Updated on: Nov 03, 2026 | 4:46 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎదురయ్యే పరిస్థితులు, పాత్రల ఎంపిక, కథల్లో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత వంటి అంశాలపై బాలీవుడ్ నటి రాధికా ఆప్టే తరచూ తన అభిప్రాయాలను పంచుకుంటుంది. ముఖ్యంగా దక్షిణాది సినిమాల్లో తనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి గతంలోనూ మాట్లాడిన ఆమె.. తాజాగా మరోసారి టాలీవుడ్‌పై చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. తెలుగు సినిమాల్లో నటించిన సమయంలో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. తాజాగా కీర్తి సురేష్‌తో కలిసి నటించిన ‘అక్క’ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే తన కెరీర్‌లో ఎదురైన కఠినమైన పాత్ర గురించి మాట్లాడింది. ఓ తెలుగు సినిమాలో తనకంటే చాలా పెద్ద వయసున్న నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని, కథలో మేనమామతో పెళ్లి నేపథ్యం కూడా ఉందని తెలిపింది. అంతేకాదు, సినిమా పూర్తయ్యేలోపే తన పాత్ర చనిపోవడం, ఆతర్వాత తన డెడ్ బాడీని ఆయన భుజం పై వేసుకొని తీసుకెళ్లడం కూడా తనకు అసంతృప్తిని కలిగించిందని చెప్పుకొచ్చింది. ఆ పాత్రకు సంబంధించిన ప్రతి అంశం తనకు నచ్చలేదని తెలిపింది రాధికా. ఆమె సినిమా పేరు చెప్పకపోయినా అది బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా అని అందరికి అర్ధమైపోయింది.

ఈ సందర్భంగా రాధికా ఆప్టే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో మహిళా పాత్రల చిత్రీకరణపై కూడా తన అభిప్రాయాలను వెల్లడించింది. ముఖ్యంగా కథల్లో హీరోల ప్రాధాన్యత ఎక్కువగా ఉండటం, హీరోయిన్ల పాత్రలకు పరిమితమైన ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలపై ఆమె గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసింది. దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో పనిచేసిన అనుభవాలపై గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. రాధికా వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. సినిమా కథ, హీరో, తన పాత్ర గురించి ముందుగానే తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు నచ్చకపోతే ఎందుకు అంగీకరించారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ‘లెజెండ్’ తర్వాతి ఏడాదే బాలకృష్ణతో కలిసి ‘లయన్’ సినిమాలోనూ ఆమె నటించడాన్ని ఫ్యాన్స్ ప్రస్తావిస్తున్నారు. అప్పట్లోనే ఇబ్బందిగా అనిపిస్తే మళ్లీ అదే హీరోతో సినిమా ఎందుకు చేశారంటూ కొందరు రాధికను నిలదీస్తున్నారు.

ఇక రాధికా వ్యాఖ్యల్లో మేనరికం ప్రస్తావన కూడా ఆసక్తికరంగా మారింది. తెలుగు, తమిళ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాల్లో మేనరికపు వివాహాలు సంప్రదాయంగా ఉన్నాయని, అలాంటి నేపథ్యాలను కథల్లో చూపించడం ప్రాంతీయ సంస్కృతిలో భాగమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సంప్రదాయాలను సినిమాల్లో చూపించడం ఒక అంశమైతే, ఒక నటిగా ఆ పాత్రపై తనకు ఉన్న వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించడం మరో అంశమని మరికొందరు అంటున్నారు. ఇటీవలే దక్షిణాది సినిమాల్లో ఉత్తరాది హీరోయిన్లకు అందంగా ఆకర్షణీయంగా.. ముఖ్యంగా తెల్లగా ఉంటే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారనే అభిప్రాయాన్ని కూడా రాధికా ఆప్టే వ్యక్తం చేసింది. స్థానిక భాష తెలిసిన దక్షిణాది నటీమణులకు అవకాశాలు ఇవ్వకుండా ఇతర ప్రాంతాల నుంచి నటీమణులను తీసుకురావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది దీని పై కూడా నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us