
సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తమ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కించిన ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా, ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ ట్రైలర్‌పై వచ్చిన చిన్నపాటి వివాదం గురించి నాగ వంశీ స్పందించారు. 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ తీసిన దర్శకుడి నుండి ఇలాంటి ట్రైలర్ ఆశించలేదన్న విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రతి దర్శకుడు తమ ప్రతిభ మేరకు ఎలాంటి కథలైనా చెప్పవచ్చని, సినిమాను చూసే ముందు దర్శకుడు ఇచ్చిన ఇంటర్వ్యూను చూడమని సూచించారు. “ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అమ్మాయిని కలవడం, ప్రేమించడం కామన్. అవి సినిమాటిక్‌గా చూపించడంలో తప్పు లేదు” అని ఆయన అన్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య బంధాన్ని, వారి మధ్య ఉండే సంబంధాన్ని ఎంత స్వచ్ఛంగా, ప్యూర్‌గా చూపించారో సినిమా చూస్తే తెలుస్తుందని నాగవంశీ అన్నారు.
సాధారణ తెలుగు సినిమాల్లో చూపించే ఇంటి సమస్యలు, కుటుంబ గొడవలకు భిన్నంగా, ఒక జంట ప్రాక్టికల్‌గా ఎదుర్కొనే సమస్యలను ఈ సినిమాలో చాలా బాగా చూపించారని వంశీ వివరించారు. ఈ సినిమాను గర్ల్‌ఫ్రెండ్‌తో, భార్యతో లేదా తల్లితో సహా ఎవరితోనైనా కలిసి చూడవచ్చని, ఇది ఎమోషన్స్ పంచుకునే కుటుంబ చిత్రమని స్పష్టం చేశారు. ట్రైలర్‌లో కనిపించిన ముద్దు సన్నివేశం ఆధారంగా సినిమాను అడల్ట్ ఫిల్మ్గా భావించవద్దని ప్రేక్షకులను కోరారు.”రెండు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో దాదాపు గంటా నలభై నిమిషాలు వైష్ణవి, ఆనంద్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలకూ మీరు ఎంత కనెక్ట్ అయితే సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుంది” అని నాగ వంశీ తెలిపారు.
నిజామాబాద్, వనపర్తి వంటి రూరల్ తెలంగాణ ప్రాంతం నుండి వచ్చిన కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న కుర్రాడు, ఒక కాన్ఫిడెంట్ అమ్మాయి ప్రేమలో పడితే వారి బంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో చక్కగా చూపించారని వివరించారు. ఆర్థిక నేపథ్యం ఆధారంగా సంబంధాలు ఎలా ప్రభావితమవుతాయో కూడా సినిమాలో ఉంటుందని తెలిపారు. అలాగే తనకు రొమాంటిక్ కామెడీ చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు ఇష్టమైన జానర్ అని వంశీ వెల్లడించారు. ఏం మాయ చేసావే వంటి చిత్రాలను చూసినప్పుడు అలాంటి సినిమాలు తీయాలని కోరిక ఉండేదని గుర్తు చేసుకున్నారు. ఎపిక్ మొదటి భాగంలో హృదయాన్ని హత్తుకునే మూడు, నాలుగు సన్నివేశాలు ఉన్నాయని, ప్రేమించుకునే జంటలు ఈ సినిమాతో తప్పకుండా కనెక్ట్ అవుతారని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.