
హాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక చిన్న సినిమా పెద్ద సంచలనంగా మారింది. యువ దర్శకుడు కర్రీ బార్కర్ తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తోంది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం కేవలం 7 నుంచి 9 కోట్ల రూపాయల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటికే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
సాధారణ యువకుడు తన ప్రేమను పొందాలనే ఉద్దేశంతో ఓ అతీంద్రియ శక్తులు ఉన్న మాయా వస్తువును ఉపయోగిస్తాడు. అయితే అతను కోరుకున్న కోరిక నిజమవుతుంది. కానీ ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకునే భయానక పరిణామాలు, మానసిక సంఘర్షణలే ‘అబ్సెషన్’ కథ. ప్రేమ, వ్యామోహం, భయం అనే మూడు అంశాలను కలిపి ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టేలా దర్శకుడు కథను నడిపించాడు.
అతి తక్కువ లొకేషన్లు, పరిమిత పాత్రలు, చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ప్రస్తుతం హాలీవుడ్‌లో పెద్ద స్టూడియో సినిమాలకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన మౌత్ టాక్ కారణంగా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండో వారంలో కూడా వసూళ్లు పెరగడం హాలీవుడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం థియేటర్లలో ‘మైఖేల్’, ‘ది డెవిల్ వేర్స్ ప్రాడా 2’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నప్పటికీ.. ‘అబ్సెషన్’ తన సత్తా చాటుతోంది. ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఫోకస్ ఫీచర్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
సినిమాకు వస్తున్న అద్భుత స్పందనతో ఇప్పటికే సీక్వెల్‌పై చర్చలు మొదలైనట్లు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శకుడు కర్రీ బార్కర్ పేరు ఇప్పుడు హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన అతను.. ఇప్పుడు హాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. భారీ సెట్లు, స్టార్ హీరోలు, వందల కోట్ల బడ్జెట్ అవసరం లేకుండానే.. బలమైన కథ, కొత్త ఆలోచన, సమర్థవంతమైన కథనం ఉంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ‘అబ్సెషన్’ మరోసారి నిరూపించింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో వినిపిస్తున్న ఒకే మాట.. “కంటెంట్ ఈజ్ ది కింగ్!”