రామదాసుగా నాగార్జున నటనా కౌశలం.. 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చిరస్మరణీయం ‘శ్రీరామదాసు’ భక్తికావ్యం

మన్మధుడు, సంతోషం వంటి రొమాంటిక్, ఫ్యామిలీ లవ్ స్టోరీలతో అభిమానులను అలరించే అక్కినేని నాగార్జునతో అన్నమయ్య లాంటి భక్తి రస చిత్రాన్ని తెరకెక్కించి ఆయనలోని నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆ తర్వాత మరోసారి శ్రీరామదాసు సినిమాతో అలరించారు.

రామదాసుగా నాగార్జున నటనా కౌశలం.. 20 ఏళ్లు గడిచినా ఇప్పటికీ చిరస్మరణీయం ‘శ్రీరామదాసు’ భక్తికావ్యం
Sriramadasu

Updated on: Mar 30, 2026 | 6:10 AM

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన భక్తి రస చిత్రం శ్రీరామదాసు. రామ భక్తి, సాధన, భావోద్వేగాలను మేళవించి భారీ విజయాన్ని అందుకుంది. రామదాసు జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం, ‘అదిగో అదిగో భద్రగిరి’, ‘దాశరథీ…’, ‘అంతా రామమయం’ వంటి గీతాలు ఇప్పటికీ భక్తుల నోట మార్మోగుతున్నాయి. ఇది కేవలం సినిమా కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక భక్తి రస ప్రధాన చిత్రాన్ని అందించింది.

దర్శకుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. భక్తి, గ్రాండ్ విజువల్స్‌, ఎమోషనల్ డెప్త్‌తో తీసిన శ్రీరామదాసు సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించింది. అందరికీ తెలిసిన కథే అయినా గ్రిప్పింగ్‌గా, సినిమాటిక్‌గా చూపించడంలో ఆయన అనుభవం స్పష్టంగా కనిపించింది. ఎమోషన్, డాన్స్, సంగీతం అన్నీ బ్యాలెన్స్ చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. ఎన్నో సినిమాలను తెరకెక్కించిన అనుభవం ఉన్న రాఘవేంద్రరావు కెరీర్‌‌లో శ్రీరామదాసు సినిమా మరో ఎత్తు.

కెరీర్‌‌ బెస్ట్‌..

అక్కినేని నాగార్జున భక్త రామదాసు పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. బీజ్ లుక్, గడ్డం, భక్తి భావం, కీర్తనలు పాడే సీన్స్, ఎమోషనల్ డెప్త్.. అన్నీ నాగార్జున కెరీర్‌‌లో బెస్ట్. ఒక సాధారణ ఉద్యోగి నుంచి రామ భక్తుడిగా మారి, ఆలయ నిర్మాణం కోసం సర్వస్వం త్యాగం చేసే పాత్రలో నాగార్జున నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన డైలాగ్ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్ ఇప్పటికీ భక్తులను ఉత్తేజపరుస్తాయి.

ఫ్యామిలీ పాత్రల్లో ఇట్టే ఒదిగిపోయే హీరోయిన్ స్నేహ కమల క్యారెక్టర్‌‌లో మెప్పించారు. భక్తి, భావోద్వేగాలు, కుటుంబ బంధాలు నిండిన పాత్రలో హార్ట్ టచింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాగార్జునతో ఆమె కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్, సీన్లు ప్రేక్షకుల హృదయాలను స్పృశించాయి. అంతేకాకుండా అక్కినేని నాగేశ్వరరావు, సుమన్ (రాముడి పాత్ర) వంటి సీనియర్ నటులు కూడా తమ నటనతో సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి.

20 ఏళ్లు గడిచినా ‘శ్రీరామదాసు’ భక్తి భావం, సంగీతం, నటన తెలుగు సినిమా ప్రేమికులను, రామ భక్తులను ఇప్పటికీ ఆకట్టుకుంటోంది. టెక్నాలజీ డెవలప్ అవుతున్నా సాంస్కృతిక, భక్తి రస చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని శ్రీరామదాసు సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. జై శ్రీరామ్!

Follow Us