దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ప్రాంతీయ చిత్రపరిశ్రమగా ఉన్న టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర హైలెట్ అని చెప్పుకోవాలి. రాజమాత శివగామి పాత్రలో ఆమె నటన అద్భుతం. రాజమౌళి దర్శకత్వం.. రమ్యకృష్ణ అద్భుతమైన నటన.. శివగామి పాత్రను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. అయితే ఈ రోల్ కోసం ముందుగా అనుకున్నది రమ్యకృష్ణను కాదట. ఈ పాత్ర కోసం పలువురిని సంప్రదించామని స్వయంగా జక్కన్నే తెలిపారు. అందులో మంచి లక్ష్మి కూడా ఒకరు. రమ్యకృష్ణ కంటే ముందు ఈ రోల్ కోసం మంచు లక్ష్మిని సంప్రదించారట. కానీ తాను నటించను అని చెప్పేసిందట. అందుకు ఓ బలమైన కారణం కూడా ఉందన్నారు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ” బాహుబలిలో శివగామి పాత్ర కోసం నన్ను సంప్రదించారు. అయితే ప్రభాస్ కు తల్లిగా నేను చేయాలనుకోలేదు. ఇండియాలో మనం ఒక పాత్ర పోషించిన తర్వాత దానిలోనే ఉండిపోతాం. కానీ నేను మాత్రం ఒకే తరహా పాత్రలకు పరిమితం కావాలనుకోలేదు. బాహుబలి సినిమా అంత పెద్ద హిట్ అయ్యాక .. నిజానికి నేను చాలా గర్వపడ్డాను. హమ్మయ్యా.. నేను ఆ సినిమా చేయలేదు అనుకున్నాడు. అది ఓ ప్రత్యేకమైన సినిమా కావచ్చు. కానీ ఆ పాత్రకు నేను కరెక్ట్ అనిపించలేదు. నా జీవితం.. నా కెరీర్ దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకున్నాను. అలాగే నేను నా కెరీర్ లో చేసిన ఐరేంద్రి లాంటి పాత్ర ఇంకోటి రాలేదు. ఇక మీదట రాదు కూడా ” అంటూ చెప్పుకొచ్చారు.
సీనియర్ హీరో మోహన్ బాబు నటవారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు మంచు లక్ష్మి. అంతేకాదు.. హాలీవుడ్ లోనూ మూడు చిత్రాల్లో నటించారు. ఫస్ట్ మూవీలో ఐరేంద్రి అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించి అదరగొట్టారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించారు. అంతేకాకుండా ఝుమ్మంది నాదం సినిమాతో నిర్మాతగానూ మారారు. ప్రస్తుంత మంచు లక్ష్మి మోహన్ లాల్ హీరోగా వస్తున్న మాన్ స్టర్ మూవీలో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 21న విడుదల కాబోతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.