మనకి ఏం ఉంటే సంతోషంగా ఉంటామో.. అది ఈ సినిమా చెబుతుంది: నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్

|

Jan 08, 2025 | 9:48 PM

రూపేష్ కథానాయకుడిగా మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన సినిమా 'షష్టిపూర్తి'. నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకున్న అర్చన ఇందులో ప్రధాన తారాగణం. క్లాసిక్ ఫిల్మ్ 'లేడీస్ టైలర్' విడుదలైన 38 ఏళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఆకాంక్షా సింగ్ ఇందులో రూపేష్ సరసన కథానాయికగా నటించారు.

మనకి ఏం ఉంటే సంతోషంగా ఉంటామో.. అది ఈ సినిమా చెబుతుంది: నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్
Rajendra Prasad
Follow us on

షష్టిపూర్తి సినిమా గురించి రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘షష్టిపూర్తి.. ఈ అదృష్టం నా ఒక్కడికేనా.. లేదంటే ఇంకెవరికైనా ఉందా? మీడియా వాళ్లని మీడియా మిత్రులు అని అనను. దాదాపు వారు కూడా నాతో పాటు 40, 30 సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నారు. అందుకే మీడియా సోదరులు అని అంటాను. వారంతా నాపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే.. ఆ భగవంతుడు నాకిచ్చిన అదృష్టం అని అనుకుంటాను. అదృష్టం ఏమిటని అనుకుంటున్నారా? వయసుకు తగినట్లుగా పాత్రలు. రాజేంద్ర ప్రసాద్‌కు షష్టిపూర్తి. నిజ జీవితంలో నాకు అరవై దాటిన తర్వాత షష్టిపూర్తి పెట్టకుండా తప్పించుకున్నాను. కానీ భగవంతుడు ఊరుకుంటాడా? ఇదిగో ఇలా షష్టిపూర్తి చేశాడు. ఇది సినిమా కాదు.. జీవితం. మీ అందరి ఇళ్లలోని వస్తువును అయిపోయాను నేను అన్నారు.

ఇది కూడా చదవండి : 8th క్లాస్‌లో షూటింగ్ స్టార్ట్ చేస్తే.. ఎండ్ అయ్యేసరికి ఇంటర్ అయిపొయింది.. ఆర్ఆర్ఆర్ మల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

పీవీ నరసింహారావుగారు.. ప్రధానిగా చేశారు దేశానికి. ఆయన ఏమనేవారో తెలుసా.. ‘ఇంట్లో కంచం ఉంటాది.. మంచం ఉంటాది.. ప్రసాదు ఉంటాడు’ అని అనేవారు. నిజంగా నేను ‘ఆ నలుగురు’ తర్వాత చేసిన సినిమాలు భగవంతుడు వేసిన భిక్ష అనే అనుకోవాలి. నిజంగా ఈ సినిమాలో పనిచేసిన నేను కాదు.. అందరూ కూడా గర్వపడే సినిమా. ఎందుకంటే, సినిమా మారిపోయింది. సినిమా ఇంటికి వచ్చేసింది. ఓటీటీలో రూపంలో ఇంట్లోకి వచ్చేసింది. థియేటర్ల నుండి ఇంటికి వచ్చేసింది. ఒకప్పుడు నా సినిమాల గురించి ఏం మాట్లాడుకునే వారంటే.. ఇది రాజేంద్రపసాద్ సినిమానా? అయితే కారు పెట్టడానికి ప్లేస్ ఉండదండి. ఫ్యామిలీల ఫ్యామిలీలు సినిమాలకు వస్తారనేవారు. ఒక టికెట్ తెగే దగ్గర 10, 12 టికెట్లు తెగేవని అనేవారు. నిజంగా అది నిజమైతే.. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలి. తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం బిడ్డలకు ఉండదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందీ అంటే అది షష్టిపూర్తి ఒక్కటే. ప్రతి మనిషికి షష్టిపూర్తి చాలా ముఖ్యం. ఒక అద్భుతమైన సినిమా చేసే అవకాశాన్ని నాకు కల్పించాడు దర్శకుడు పవన్.

ఇది కూడా చదవండి : కోయ్.. కోయ్.. కేక పెట్టించిందిరోయ్..! దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురు గత్తర లేపిందిగా..!

ఫస్ట్ టైమ్ నిర్మాత అయినా కూడా.. ఎక్కడా చిన్న తేడా కూడా జరగకుండా చూసుకున్నాడు. ఇళయరాజాగారు, కీరవాణిగారు, చైతన్యప్రసాద్ ఇలాంటి వారంతా ఈ సినిమాకు పనిచేశారంటే.. నిర్మాతగా అతను ఎంత బాగా చూసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో నటించిన వారందరికీ నా మీద ఎంతో ప్రేమ, గౌరవం ఉంది. అప్పటి బ్రహ్మానందం నుండి ఇప్పుడు చంటి వరకు అందరికీ నేనంటే గౌరవం. సెట్స్‌లో కూడా చాలా చక్కటి వాతావరణం ఉండేది. హీరోగా రూపేష్ చాలా చక్కగా నటించాడు. చాలా నేర్చుకున్నాడు. ఆకాంక్ష నాతో ఇంతకు ముందు నా కుమార్తెగా నటించింది. అర్చన.. ‘లేడీస్ టైలర్’ సినిమా అప్పటికే ఆమె మెచ్యూర్డ్ నటి. నన్ను వంశీ ఎంతో భయపెట్టేవాడు. అన్ని సంవత్సరాల క్రితం నటించిన మేము.. మళ్లీ ఇలా కలుసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మా ఇద్దరి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. నాకు వర్క్ చేయడం రెస్పాన్సిబిలిటీ. నాకు పాత్ర దొరకడం అదృష్టం. ఇళయరాజా దగ్గరకి వెళ్లి.. ఈ సినిమా పేరు చెప్పి నా పేరు చెప్పగానే ఆయన కూడా షాక్ అయ్యారట. షష్టిపూర్తి ఒక మంచికథ. తెలుగు వారి సంప్రదాయం, సంస్కృతిని ఇష్టపడేవారు.. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ ఫ్యామిలీతో సహ కలిసి వెళ్లి థియేటర్లలో ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. మన ఇళ్లలో ఏం ఉంటే సంతోషంగా ఉంటామనేది ఈ సినిమా చెబుతుంది.. అందరూ చూడాలని కోరుతూ.. తెలుగు ప్రేక్షక దేవుళ్లందరికీ పాద నమస్కారాలు..’’ అని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి