ఈవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా 2000లో వచ్చిన సినిమా చాలా బాగుంది. స్నేహితుల అనుబంధానికి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా పేరుకు తగ్గట్టుగానే చాలామందితో ‘చాలాబాగుంది’ అనిపించుకుంది. ఇదే సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కన్నడ ముద్దుగుమ్మ మాళవిక. భర్త స్నేహితుడి చేతిలో అఘాయిత్యానికి గురికావడం, ఆపై ప్రతీకారం తీర్చుకునే సగటు గృహిణి పాత్రలో మాళవిక అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో శ్రీకాంత్ సతీమణి పాత్రలో మాళవిక నటిస్తే, అతని చేతిలో చిత్రహింసలకు గురయ్యే క్యారెక్టర్లో వడ్డే నవీన్ కనిపించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాళవికకు అవకాశాలు వెల్లువెత్తాయి. దీవించండి, నవ్వుతూ బతకాలిరా, ప్రియనేస్తమా, అప్పారావ్ డ్రైవింగ్ స్కూల్ తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకుల మెప్పు పొందింది. అయితే 2009 తర్వాత హఠాత్తుగా సినిమాల నుంచి మాయమైపోయింది. తెలుగులో ఆమె నటించిన ఆఖరి చిత్రం అప్పారావు డ్రైవింగ్ స్కూల్ 2004లోనే విడుదలైంది. అయితే ఈ సినిమా షూటింగ్‌లోనే జరిగిన కొన్ని ఘటనల వల్లే తెలుగు తెరకు మాళవిక దూరమైందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
సినిమాలకు దూరమైన మాళవిక 2007లో సురేశ్ మేనన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత పెద్దగా బయటకు కనిపించని మాళవిక ఆ మధ్యన అలీతో సరదాగా టీవీషోకు హాజరైంది. ఆ సమయంలో ఆమె చాలా బొద్దుగా కనిపించింది. చాలామంది సడెన్‌గా ఆమెను చూసి గుర్తుపట్టలేకపోయారు. ప్రస్తుతం మాళవిక ముంబయిలో నివసిస్తోంది. ఆమె భర్త ముంబయిలో ఆర్కిటెక్టర్ ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారట. కాగా సినిమాల్లో సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందకు ప్రయత్నాలు మొదలుపెట్టింది మాళవిక. ఇందులో భాగంగా గోల్‌మాల్ పేరుతో తమిళ్‌లో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తోంది. గతేడాదే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.జై, జీవా హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అమృత అయ్యర్, రైజా విల్సన్, ఐశ్వర్య దత్తా, మనోబాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.