యువరాజు, రాజకుమారుడు సినిమాలతో అమ్మాయిల కలల రాకూమారుడిగా మారిపోయారు ప్రిన్స్ మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా తెరంగేట్రం చేసి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం ప్రేమకథా చిత్రాలే కాకుండా మాస్, యాక్షన్ చిత్రాలతోనూ మెప్పించారు. ఒక్కడు, బాబీ, అతడు, అర్జున్, దూకుడు, ఖలేజా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కానీ కెరీర్ ప్రారంభంలోనే మహేష్ ఓ బ్లాక్ బస్టర్ హిట్ మిస్ అయ్యారు. మహేష్ చేయాల్సిన ఆ ప్రాజెక్టును హీరో తరుణ్ చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో తరుణ్ ఖాతాలో మరో ప్రేమకథ వచ్చి చేరింది. వరుసగా లవ్ స్టోరీస్ చేస్తూ అప్పట్లో లవర్ బాయ్, అమ్మాయిల డ్రీమ్ బాయ్ గా మారారు తరుణ్. ఇంతకీ తరుణ్ కు హిట్టు అందించి.. మహేష్ మిస్ అయిన సినిమా ఏదో తెలుసా ?.. అదే నువ్వు లేక నేను లేను (నువ్వు లేక నేను లేను).
వాస్తవానికి దర్శకులు, రచయితలు కొందరు హీరోలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కథలు రాస్తుంటారు. తాము అనుకున్న పాత్రలలో ఏ హీరో సెట్ అవుతాడని విషయంలో ముందే క్లారిటీకి వస్తారు. ఇక మరికొన్ని సందర్భాల్లో నిర్మాతల సలహాలు, సూచనల మేరకు ఒక్కో స్టోరీ మరోక హీరోకు సెట్ అవుతుంది. అయితే దర్శకుడు కాశీ విశ్వనాథ్ రాసిన ప్రేమకథే ‘నువ్వు లేక నేను లేను’. ఈ స్టోరీకి మహేష్ బాబు బాగుంటారని ప్రముఖ నిర్మాత సురేష్ దగ్గుబాటి సూచించగా.. ఆయన సున్నితంగా తిరస్కరించాట. తన కథలో హీరోగా తరుణ్ అనుకున్నానని అన్నారట. మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చాలామంది దర్శకులు క్యూలో ఉంటారని.. ఆయన డేట్స్ దొరకడం కష్టమని.. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందని.. తన కథకు తరుణ్ హీరోగా సరిగ్గా సెట్ అవుతాడని అన్నారట విశ్వనాథ్. అప్పటికే నువ్వే కావాలి సినిమాతో తరుణ్ హిట్ అందుకున్నారని సురేష్ బాబుకు చెప్పారట. అలా మహేష్ చేయాల్సిన సినిమా తరుణ్ వద్దకు వెళ్లింది.
2002 జనవరి 14న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో తరుణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించారు. అప్పట్లో ఈ ఇద్దరి జోడికి ఫాలోయింగ్ ఎక్కువే ఉండేది. ఈ సినిమాకు మరో హైలెట్ సంగీతం. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ శ్రోతలను ఆకట్టుకుంది. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.