
దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన నిన్నే పెళ్లాడతా చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా గతంలో ఈ సినిమా గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను, విశేషాలను పంచుకున్నారు. నాగార్జున, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఒక తరాన్ని ప్రభావితం చేసి, ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిందని కృష్ణవంశీ పేర్కొన్నారు. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు, సన్నివేశాలు కొత్తగానే అనిపిస్తాయని, కాలంతో సంబంధం లేకుండా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయని ఆయన అన్నారు. తన సినీ ప్రస్థానం శివ సినిమా సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైందని కృష్ణవంశీ తెలిపారు. ఆ తర్వాత రాము గారి దగ్గర (రామ్ గోపాల్ వర్మ) పనిచేస్తూ గులాబీ సినిమాకు దర్శకుడిగా మారానని చెప్పారు. రాముడొచ్చాడు సినిమా సమయంలో గులాబీలోని డ్రీమ్ గర్ల్, బైక్ సాంగ్స్‌ను నాగార్జున చూసి చాలా మెచ్చుకున్నారని, ఏదైనా సబ్జెక్టు ఉంటే చెప్పమని అడిగారని తెలిపారు. అప్పటికే అన్యాయం అనే హింసాత్మక కథ సిద్ధంగా ఉందని, వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని తీయాలని అనుకున్నానని వివరించారట. ఈ కథలో నాగార్జున పాత్ర సముద్రంలో ముత్యాలు పట్టుకునే వ్యక్తిగా ఉంటుందని, అండర్ వాటర్ షూట్ సింగపూర్‌లో చేయాలని ప్లాన్ కూడా వేసుకున్నామని చెప్పారు.
అయితే, గులాబీ తర్వాత అన్యాయం కోసం వైజాగ్ లొకేషన్లు చూస్తున్నప్పుడు ఒక సంఘటన తన ఆలోచనలను మార్చివేసిందని కృష్ణవంశీ గుర్తు చేసుకున్నారు. వైజాగ్ పోర్ట్‌లో లొకేషన్ల రెక్కీ జరుగుతుండగా ఒక అభిమాని వచ్చి, అచ్చం మీ బాస్ లా తీశారు, సినిమా అదిరిపోయింది బాస్ అని అభినందించారట. ఆ మాటలు విన్న తర్వాత, తనకుంటూ ఒక వ్యక్తిగత గుర్తింపు లేదేమోనని, తన బాస్ శైలిని అనుకరిస్తున్నానేమోనని ఆలోచించానని కృష్ణవంశీ చెప్పారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నాగార్జునకి ఫోన్ చేసి, కథను మార్చాలనుకుంటున్నానని చెప్పారట.
అప్పుడు నాగార్జున, శివ వంటి హింసాత్మక సినిమా తర్వాత మళ్లీ అలాంటిది కాకుండా, మిస్సమ్మ, గుండమ్మ కథ, హమ్ ఆప్ కే హై కౌన్, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే వంటి లైటర్ వెయిన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేయమని సలహా ఇచ్చారట. మొదట తనకు కుటుంబ కథా చిత్రాలు ఇష్టం లేకపోయినా, నాగార్జున గారి దూరదృష్టి, సలహా మేరకు నిన్నే పెళ్లాడతా కథను డవలప్ చేశానని కృష్ణవంశీ పేర్కొన్నారు. నాగార్జున ఇచ్చిన స్వేచ్ఛ, సహకారం అమోఘమని, నటీనటుల ఎంపిక నుంచి ప్రతి విషయంలోనూ ఆయన తనతో చర్చించేవారని, ఒక్కోసారి అభ్యంతరాలు ఉన్నా తన ఆలోచనలను గౌరవించేవారని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.