Balayya: నందమూరి బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు..

NBK111 సినిమా షూటింగ్‌లో గాయపడిన నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కాలి కండరంలో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆర్థోపెడిక్ సర్జన్ల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు.

Balayya: నందమూరి బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు..
Nandamuri Balakrishna

Updated on: Jul 22, 2026 | 4:10 PM

నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. రాజమండ్రిలో జరుగుతున్న తన తాజా చిత్రం NBK111 షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఆయన ఎడమ మోకాలికి గాయమైనట్లు ఏఐజీ ఆస్పత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో వెల్లడించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, మెరుగైన పరీక్షలు, ప్రత్యేక చికిత్స కోసం ఆయన్ను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.

ఏఐజీ ఆస్పత్రిలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు గుర్తించారు. ఈ లక్షణాలు ఆ ప్రాంతంలో మజిల్ టియర్ (కండరాల చీలిక) ఉండే అవకాశాన్ని సూచిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో విస్తృత స్థాయి క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకుంటున్నారు.

బాలకృష్ణ గత వైద్య చరిత్రను కూడా పరిగణనలోకి తీసుకుని, వివిధ విభాగాల నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తోంది. అత్యంత సురక్షితమైన, తగిన చికిత్సను నిర్ణయించేందుకు అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. కొనసాగుతున్న పరీక్షలు పూర్తయిన అనంతరం తుది చికిత్స ప్రణాళికను ఖరారు చేస్తామని, తదుపరి ఆరోగ్య వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఏఐజీ ఆస్పత్రి మెడికల్ బులెటిన్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా, బాలకృష్ణ త్వరగా కోలుకుని మళ్లీ NBK111 షూటింగ్‌లో పాల్గొంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us