
తెలుగు సినీ, టెలివిజన్ రంగాల కళాకారులు, సాంకేతిక నిపుణుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతోంది. చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన ఈ పురస్కారాలను మళ్లీ అందించేందుకు అధికారికంగా చర్యలు చేపట్టింది. 2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డుల ప్రక్రియను పూర్తి చేసి.. డిసెంబర్ 2026లో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో సినీ, టెలివిజన్ రంగాల్లో మళ్లీ నంది అవార్డుల సందడి మొదలుకానుంది.
కాగా నంది అవార్డుల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 22న జీఓ ఆర్టీ నంబర్ 1843 జారీ చేసింది. దీని ప్రకారం 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, రెండో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులను అందించనున్నారు. అంటే ఈ ఎనిమిదేళ్లకు కలిపి ఒక్కో ఏడాదికి నాలుగు చొప్పున అవార్డులు ఉంటాయి. ఇక 2025 సంవత్సరానికి మాత్రం గతంలో మాదిరిగానే అన్ని ప్రధాన విభాగాల్లో అవార్డుల ఎంపిక చేపట్టనున్నారు.
నంది ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని డిసెంబర్ 2026లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకకు అమరావతి లేదా విజయవాడ వేదిక కానున్నాయి. మరోవైపు నంది టెలివిజన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని తిరుపతిలో నిర్వహించనున్నారు. 2017-2024 సంవత్సరాలకు సంబంధించిన విజేతల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, నవంబర్‌లో జాబితాను ప్రకటించేలా షెడ్యూల్ రూపొందించారు. దీంతో ఏయే చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కుతాయనే ఆసక్తి నెలకొంది.
ఇక సినిమా రంగంతో పాటు టెలివిజన్ రంగానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి ఉత్తమ మెగా సీరియల్, రెండో ఉత్తమ మెగా సీరియల్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులను అందించనున్నారు. 2025 సంవత్సరానికి మాత్రం టెలివిజన్ విభాగంలోనూ పూర్తి స్థాయి అవార్డుల ప్రక్రియ చేపట్టనున్నారు. సీరియళ్లు, టెలిఫిల్మ్స్, ఇతర టీవీ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డుల ద్వారా గుర్తింపు లభించనుంది.
2017-2025 అవార్డులతో పాటు అంతకుముందు పెండింగ్‌లో ఉన్న పురస్కారాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 2012 నుంచి 2016 వరకు ఇప్పటికే ప్రకటించిన నంది ఫిల్మ్, టీవీ అవార్డులను కూడా ప్రదానం చేయనున్నట్టు సమాచారం. ఈ సంవత్సరాలకు సంబంధించిన అవార్డుల వేడుకను 2026 నవంబర్‌లో విజయవాడలో నిర్వహించేందుకు నిర్ణయించారు. అంతేకాకుండా ఆయా సంవత్సరాలకు సంబంధించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు.
తెలుగు సినిమా, కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964లో నంది అవార్డులను ప్రారంభించింది. లేపాక్షిలోని ప్రసిద్ధ నంది విగ్రహం స్ఫూర్తితో ఈ పురస్కారాలకు ఆ పేరు పెట్టారు. తొలినాళ్లలో బంగారు, వెండి, కాంస్య నందుల రూపంలో అవార్డులు అందించేవారు. ఆ తర్వాత నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులకు కూడా వివిధ విభాగాల్లో పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభను గుర్తించి గౌరవించే అత్యున్నత రాష్ట్ర స్థాయి పురస్కారాలుగా నంది అవార్డులు గుర్తింపు పొందాయి. ఈ నిర్ణయం సినీ, టీవి రంగా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.