జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటి ప్రియమణి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు టీవీ షోల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జవాన్‌లోనూ కీ రోల్ పోషించిందీ అందాల తార. ఇందులో లక్ష్మీగా షారుక్‌కు సహాయం చేసే పాత్రలో నటించి మెప్పించిందీ అందాల తార. గతంలో ఇదే షారుక్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది ప్రియమణి. మొత్తానికి జవాన్‌తో మరొక సూపర్‌హిట్‌ను ఖాతాలో వేసుకుందీ సీనియర్ హీరోయిన్. ఇదే జోష్‌తో మరో సూపర్‌స్టార్ సినిమాలో నటిస్తోందామె. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘నేరు’లో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ప్రియమణి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఇప్పటికే ‘నెరు’ సినిమా షూటింగ్ ప్రారంభించినట్లు ఇందులో పేర్కొంది. ‘నేరు’ చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో మోహన్ లాల్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు జీతూ జోసెఫ్. మోహన్‌లాల్, జీతు కాంబినేషన్‌లో వస్తోన్న ఐదో చిత్రమిది. ఈ సినిమా కోర్ట్ రూమ్ డ్రామాగా ఉంటుందని, మోహన్ లాల్ లాయర్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. అలాగే ప్రియమణి కూడా లాయర్ పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి.
కాగా బెంగళూరులో జన్మించిన ప్రియమణి ఎవరే అతగాడు సినిమాతో సినిమా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత తమిళ్, మలయాళ, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. 2007లో విడుదలైన తమిళ చిత్రం ‘పరుత్తివీరన్’లో ప్రియమణి నటనకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఈ ఏడాది నాగచైతన్య నటించిన కస్టడీ సినిమాలో ఓ కీ రోల్ పోషించింది. ప్రస్తుతం కొటేషన్ గ్యాంగ్, ఖైమారా, మైదాన్ తదితర సినిమాల్లో నటిస్తోందీ అందాల తార.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.