
సుధ తన జీవితంలో స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రాణాలు కాపాడిన రెండు ప్రధాన సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. మొదటిది 1991లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా షూటింగ్‌లో జరిగింది. తీవ్రమైన అపెండిసైటిస్‌తో బాధపడుతూ, షూటింగ్‌లో ఉన్నట్టుండి నాగార్జున గారిపై పడిపోయినప్పుడు, నాగార్జున వెంటనే స్పందించి ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. 45 నిమిషాల్లోపు ఆపరేషన్ చేయించి ఆమె ప్రాణాలు కాపాడారు. “ఒక గంట ఆలస్యం అయ్యి ఉంటే రక్తం అంతా పాయిజన్ అయ్యి నేను చనిపోయేదాన్ని” అని సుధ పేర్కొన్నారు. రెండవ సంఘటన రావోయి చందమామ సినిమా షూటింగ్‌లో కబడ్డీ సీన్‌లో జరిగింది. చంద్రమోహన్ గారు కాలు లాగినప్పుడు స్లిప్ డిస్క్ సమస్య వచ్చి, సుధ లోయర్ పార్ట్ పని చేయకుండా పడిపోయారు. అప్పుడు కూడా నాగార్జున స్వయంగా తన వ్యక్తిగత డాక్టర్‌ను పిలిపించి చికిత్స చేయించారు. ఈ ఘటనలన్నీ తన జీవితంలో నాగార్జున స్థానాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయని, దేవుడు ఆయన రూపంలో వచ్చి తనను కాపాడారని సుధ ఎమోషనల్ గా తెలిపారు. ఓం నమో వెంకటేశాయ చిత్రం సమయంలో కూడా నాగార్జునతో ఈ విషయాలను పంచుకున్నట్లు ఆమె తెలిపారు.
నాగార్జున, రాఘవేంద్ర రావు వంటి ప్రముఖులతో కలిసి పనిచేయడం పట్ల సుధకు ప్రత్యేక గౌరవం ఉంది. నాగార్జునతో 17 చిత్రాలు, రాఘవేంద్ర రావుతో 14 చిత్రాలు చేశానని ఆమె చెప్పారు. ఓం నమో వెంకటేశాయలో చిన్న పాత్ర అయినా, కేవలం సెంటిమెంట్ కోసమే చేశానని, ముఖం తెలియని వారితో పని చేయడం కంటే ఒక గుర్తింపు ఉన్నవారితో పనిచేయడం తనకు ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. పాత్రకు ప్రాధాన్యత ఉంటే, యంగ్ డైరెక్టర్స్, కొత్త నటులతో కూడా పని చేయడానికి సిద్ధంగా ఉంటానని అన్నారు. శరణం గచ్ఛామి సినిమాలో తాను చేసిన పాత్ర తనకు సంతృప్తినిచ్చిందని, మదర్ పాత్రలో భర్తను కూడా నిలదీసే క్యారెక్టర్ నచ్చిందని వివరించారు.
అదే సమయంలో, సినీ పరిశ్రమలో మారుతున్న పరిస్థితుల పట్ల ఆమె కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో షూటింగ్ స్పాట్‌లో అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకునేవారని, ఒకరితో ఒకరికి బంధాలు ఏర్పడేవని ఆమె గుర్తుచేసుకున్నారు. కారవాన్ సంస్కృతి వచ్చాక ఎవరి లోకం వారిదైపోయిందని, నటీనటుల మధ్య బంధం తగ్గిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తను చంద్రమోహన్‌తో కలిసి 50 చిత్రాలు చేశానని, దాసరి నారాయణ రావు గారితో పనిచేస్తున్నప్పుడు, చంద్రమోహన్‌తో తన 50వ సినిమా తన దర్శకత్వంలో చేస్తానని దాసరి గారు చెప్పిన మాటలను సుధ గుర్తు చేసుకున్నారు. అలాంటి అనుబంధాలు ఇప్పుడు కరువయ్యాయని ఆమె అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి