
హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ సరసన ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తున్న ఆమె.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితం, భవిష్యత్ ఆశయాలపై మనసు విప్పి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన ప్రియమైన స్నేహితురాలు స్నేహతో ఉన్న అనుబంధం, కెరీర్ ఎంపికలు, అభిమాన నటుడు, అలాగే తెలుగు ప్రేక్షకులపై తనకు ఉన్న గౌరవం గురించి వెల్లడించారు.

స్నేహతో తన స్నేహం ఎలా మొదలైందో శ్రీదేవి వివరించారు. తన సోదరి స్నేహతో కలిసి ప్రియమైన నీకు చిత్రంలో నటించినప్పుడు తాను షూటింగ్ లో ఆమెతో పాటు వెళ్ళానని, అక్కడే వారి స్నేహం బలపడిందని తెలిపారు. ఆ సినిమా నుంచే తమ కుటుంబాలు చాలా సన్నిహితంగా మెలిగాయని, ఎన్నో సంవత్సరాలుగా వారు ప్రతి వేడుకను కలిసే చేసుకుంటారని ఆమె చెప్పారు. స్నేహ అందమైన వ్యక్తి అని, పరిశ్రమలో అలాంటి నిష్కపటమైన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని శ్రీదేవి అన్నారు. అప్పట్లో ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని పేర్కొన్నారు.

అభిమాన హీరో గురించి అడగగా, శ్రీదేవి విజయ్ కుమార్ తన అభిమాన నటుడు విజయ్ దేవరకొండ అని వెల్లడించారు. సమయానుసారంగా అభిమాన నటులు మారుతూ ఉంటారని, కానీ ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె తెలిపారు. తాను ఎల్లప్పుడూ సినిమా పరిశ్రమతోనే అనుబంధం కలిగి ఉంటానని, ఇది తన రక్తంలోనే ఉందని శ్రీదేవి చెప్పారు. తెరపై గానీ, తెర వెనుక గానీ ఏదో ఒక రూపంలో సినిమాతో తన బంధం కొనసాగుతుందని ఆమె అన్నారు. సినిమా తప్ప తనకు మరో ప్రపంచం లేదని, జీవితాంతం సినీ పరిశ్రమలో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తానని వెల్లడించారు. నటన తప్ప మరో వృత్తిని ఎప్పుడూ ఊహించుకోలేదని తెలిపారు.

తెలుగు ప్రేక్షకుల పట్ల తనకున్న కృతజ్ఞతను శ్రీదేవి అద్భుతంగా వ్యక్తం చేశారు. తన మొదటి సినిమా ఈశ్వర్ నుండి ఇప్పటి వరకు 20కి పైగా ఆడియోలలో తనను గుర్తుంచుకొని ప్రేమను చూపినందుకు తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రేక్షకులు తమ ఆర్టిస్టులకు చాలా ప్రేమను, గౌరవాన్ని ఇస్తారని, ఇది ఒక నటిని నిజంగానే ఒక డ్రీమ్ వరల్డ్లోకి తీసుకువెళ్తుందని ఆమె అన్నారు. ఏ భాషా చిత్ర పరిశ్రమ నుండి వచ్చినా, తెలుగు ప్రేక్షకులంత ప్రేమను చూపించే ఆడియన్స్ ఎక్కడా లేరని ఏ ఆర్టిస్ట్ అయినా ఒప్పుకుంటారని శ్రీదేవి చెప్పారు. తెలుగు పరిశ్రమలో ఇన్నేళ్లు ఉండడం తన అదృష్టమని, ఇంకా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్షకులతో తన ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపారు.

నటిగా విభిన్నమైన, సవాలుతో కూడిన పాత్రలు చేయాలనే కోరిక తనకు బలంగా ఉందని శ్రీదేవి వెల్లడించారు. తాను ఒక దర్శకుడి నటిగా ఉండాలని కోరుకుంటున్నానని, దర్శకుడి విజన్‌ను తెరపైకి తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. ఛాలెంజింగ్ పాత్రలు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆమె అన్నారు. అయితే, బోల్డ్ అనే పదానికి అనేక అర్థాలున్నాయని, తన వ్యక్తిత్వానికి సరిపోయే, తన పరిమితులలో సౌకర్యవంతంగా అనిపించే పాత్రలను మాత్రమే చేస్తానని స్పష్టం చేశారు. బలవంతంగా, అసౌకర్యంగా చేసే పాత్రలకు తాను దూరం ఉంటానని చెప్పారు