అందుకే ఆ ఫ్లాప్ తర్వాత ఆ డైరెక్టర్‌తో సినిమా చేయలేదు.. మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబుది ప్రత్యేక స్థానం. విలన్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన హీరోగా సక్సెస్ అయ్యాడు. ఏకంగా 500 కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించాడు. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. అలాగే డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అనే బిరుదులు కూడా సొంతం చేసుకున్నాడు.

మోహన్ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో అనేక అంశాలపై తనదైన శైలిలో స్పందించారు. దర్శకుడు వంశీ, పూరి జగన్నాథ్, దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు వంటి ప్రముఖులతో తన అనుబంధం, కెరీర్‌లో ఎదుర్కొన్న ఆరోపణలు, దర్శకుల ఎంపికపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దర్శకుడు వంశీతో డిటెక్టివ్ నారద సినిమా పరాజయం పాలైన తర్వాత మళ్లీ ఆయన దర్శకత్వంలో నటించకపోవడంపై మోహన్ బాబు స్పందించారు. వంశీ ఒక సమర్థుడైన దర్శకుడని, ఆ సినిమా పరాజయం పాలైనప్పటికీ అతనిపై తన గౌరవం అలాగే ఉందని చెప్పారు. డిటెక్టివ్ నారద తర్వాత తన సొంత బ్యానర్‌లో వంశీతో మరో సినిమా చేసేందుకు డబ్బులు కూడా ఇచ్చానని, ఈరోజు కూడా వంశీని అడిగితే ఆ విషయం చెప్తాడని అన్నారు. అయితే, వ్యాపార కోణం నుంచే ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదని, ఒక సినిమా పరాజయం పాలైతే దానిని కొనసాగించడం కష్టమని, తాను హీరోగా పనికి రానప్పుడు ఎవరూ పెట్టుకోరని స్పష్టం చేశారు.
కొందరు దర్శకుల పట్ల మోహన్ బాబు కఠినంగా ప్రవర్తించారనే ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. మోహన్ బాబుకు సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌పై కమాండ్ ఉందని, దర్శకుడిగా మారాలని ఎందుకు అనుకోలేదని ప్రశ్నించగా, 24 క్రాఫ్ట్స్ తనకు తెలుసని అనడం అవివేకమని అన్నారు. అలా తెలిసుంటే తన సినిమాలు పరాజయం పాలయ్యేవి కావని పేర్కొన్నారు. తమ గురువుగారైన దాసరి నారాయణరావుగారికి మాత్రమే అన్ని క్రాఫ్ట్స్ పై పట్టు ఉండేదని, ఆయన గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. దర్శకుడిగా పనిచేయడం చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.
దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావుల మధ్య వృత్తిపరమైన వైరం ఉండేదనే అభిప్రాయాన్ని మోహన్ బాబు తోసిపుచ్చారు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకునేవారని, తన మంచి తనం వల్లే ఇద్దరికీ తాను సన్నిహితుడిగా మారానని చెప్పారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తాను నటించిన అల్లరి మొగుడు విజయం సాధించిందని గుర్తు చేశారు. దాసరి తన గురువు అని, దర్శకుడిగా ఆయనకు మొదటి స్థానం ఇస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుత జనరేషన్ దర్శకుల్లో ఎవరితో సినిమా చేయాలని ఉందనే ప్రశ్నకు, తనకు ఎవరితో సినిమా చేయాలనే కోరిక లేదని, అందరినీ గౌరవిస్తానని చెప్పారు. గత తరంలో కేఎస్ఆర్ దాస్, రవిరాజా పినిశెట్టి, బి. గోపాల్ వంటి దర్శకులంటే తనకు ఇష్టమని పేర్కొన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




