ఫ్యామిలీ వీక్.. మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. ఇన్నాళ్లు గొడవలు.. కోపాలు.. పంతాలు అంటూ రచ్చ చేసిన కంటెస్టెంట్స్.. ఈవారం మొత్తం సంతోషంగా కలిసిపోయి ఎంజాయ్ చేస్తున్నారు. మొదటి వారం నుంచి ఉప్పు, నిప్పులా గొడవపడిన యావర్, గౌతమ్.. నిన్నటి ఎపిసోడ్లో మాత్రం అన్నదమ్ములుగా కలిసిపోయారు. గౌతమ్ తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న యావర్‌ను గుండెలకు హత్తుకుని ఓదార్చాడు డాక్టర్ బాబు. అలాగే తన మాటలతో, పాటలతో అందరి మనసులను గెలుచుకున్నాడు భోలే. ఇక ఇప్పుడు అమర్ దీప్ ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే ఎప్పటిలాగే మరోసారి అమర్ దీప్ ను ఆటపట్టించాడు బిగ్‌బాస్. కేక్ పంపించింది తేజూ.. కానీ తను రాలేకపోయిందని ముందు నిరాశపరిచాడు. తేజూ రాక కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అమర్ దీప్ మొదట బాధపడినా.. కేక్ పంపినందుకు తేజూకు థాంక్స్ చెబుతూనే వెళ్లిపోయాడు. కానీ అప్పటికే హౌస్ లోకి అడుగుపెట్టింది అమర్ దీప్ సతీమణి తేజూ.
తాజాగా విడుదలైన ప్రోమోలో.. నవంబర్ 8న అమర్ దీప్ పుట్టినరోజు కావడంతో అతడిని కన్ఫెన్షన్ రూంకు రమ్మని పిలిచాడు బిగ్‌బాస్. అమర్ దీప్ ఎదురుగా క్లాత్ కప్పిన వస్తువు పెట్టి ఏంటీ అడగ్గా..కేక్ అనుకుంటున్నా బిగ్‌బాస్ అని చెప్పాడు. తేజూ రాలేకపోయిందని చెప్పడంతో నిరాశకు గురయ్యాడు అమర్ దీప్. అయినా కేక్ పంపించినందుకు సంతోషపడతాడు. అమర్ బయటకు వెళ్లేముందు పిలిచి మరీ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు బిగ్‌బాస్. ఇది కదా కావాల్సింది బిగ్‌బాస్ అంటూ సంతోషంతో బయటకు వెళ్తాడు అమర్. ఇంటి సభ్యులకు కేక్ చూపిస్తూ తేజూ రాలేకపోయిందట.. అందుకే కేక్ పంపించింది అని చెప్పేస్తాడు. కానీ అప్పటికే ఇంట్లోకి తేజూ వచ్చి అందరితో మాట్లాడేస్తుంది. అమర్ బయటకు వచ్చే సమయానికి అతడినికి కనిపించకుండా పక్కనే ఉంటుంది.
కేక్ టేబుల్ పై పెట్టిన తర్వాత అమర్ తలపట్టుకుని తేజూను చూపిస్తాడు శివాజీ. దీంతో ఒక్కసారిగా అమర్ దీప్ షాకయ్యాడు. ఆ తర్వాత తేజూను హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. చాలా మిస్సయ్యానమ్మా.. కొన్నిసార్లు పడుకుని ఏడ్చాను.. ఏడిస్తే కనబడుతుందని తెలియకుండా ఏడ్చాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. సరిగ్గా తిను పడుకో అంటూ తేజూ జాగ్రత్తలు చెప్పగా.. ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో తేజూ, అమర్ ప్రపోజ్ చేసుకోవడంతో ప్రోమో ముగిసింది. ఈరోజు ఎపిసోడ్ లో అమర్ దీప్, ప్రశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ రానున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.