
ప్రముఖ సినీ నటి రమ్యకృష్ణ జయంము నిశ్చయమ్మురా విత్ జగపతి అనే కార్యక్రమంలో తన సహ నటుడు జగపతిబాబుతో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరలవుతున్నాయి. ఇందులో తన వివాహం, కెరీర్, జీవిత తత్త్వం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు కృష్ణవంశీతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, మేఘాలలో తేలిపొమ్మన్నది పాటతో ఆయనతో కనెక్షన్ ఏర్పడిందని, ఆ తర్వాత పెళ్లి, కుమారుడి జననం జరిగిందని తెలిపారు. వివాహంపై ఆమె తనదైన శైలిలో మాట్లాడుతూ, “కొన్నిసార్లు వివాహం అతిగా అంచనా వేయబడుతుందని నేను భావిస్తాను. మేము భార్యాభర్తల కంటే ఉత్తమ స్నేహితులు, ఉత్తమ సహచరులం” అని పేర్కొన్నారు. పెళ్లికి ముందే తమ మధ్య గొడవలు ఎక్కువగా ఉండేవని, కానీ వివాహం తర్వాత గొడవలు లేవని ఆమె గుర్తుచేసుకున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని కూడా పంచుకుననారు. జగపతిబాబు తన కెరీర్లో శుభలగ్నం సినిమా తన జీవితాన్ని మార్చిందని, ఈ సినిమా ఒప్పుకోవాలని రమ్యకృష్ణ పట్టుబట్టారని వివరించారు. తన డేట్లు లేవని చెప్పినప్పటికీ, రమ్యకృష్ణ “ఏమిటి, పిచ్చి ఎక్కిందా నీకు? ఒప్పేసుకో. డేట్లు నేను అడ్జస్ట్ చేస్తాను నీ కోసం” అని గట్టిగా చెప్పినట్లు జగపతిబాబు గుర్తుచేసుకున్నారు. రమ్యకృష్ణ తన స్నేహితుల్లో “అత్యంత క్రేజీ” వ్యక్తి అని, ఆమె తన పుట్టినరోజు, తన కొడుకు పుట్టినరోజుల గురించి సరదాగా మాట్లాడారు. తన కొడుకు తన పుట్టినరోజున పుట్టకూడదని తాను కోరుకున్నానని, అదృష్టవశాత్తూ అతను మరుసటి రోజు జన్మించాడని ఆమె చమత్కరించారు.
రమ్యకృష్ణ వ్యక్తిత్వాన్ని జగపతిబాబు అత్యంత ఉన్నతంగా ప్రశంసించారు. ఆమె నిజాయితీగల, వెచ్చని హృదయం కలిగిన వ్యక్తి అని, ఆమె భావాలను దాచుకోకుండా నవ్వైనా, కోపమైనా బయటికి వస్తాయని అన్నారు. “నేను ఎంతో మందిని టచ్ చేశాను. ప్రతి ఒక్కరూ రమ్యకృష్ణ అంటే వావ్ అంటారు. ఆమెపై ఎప్పుడూ ఎలాంటి తప్పుడు మాటలు వినలేదు” అని జగపతిబాబు పేర్కొన్నారు. ఆమె ఇచ్చే మంచితనం వల్లే అందరి నుండి ఆమెకు గౌరవం, ప్రేమ లభిస్తాయని ఆయన అన్నారు. ఇదంతా తన జీవితంలో చాలా తక్కువ మంది కళాకారులలో చూశానని జగపతిబాబు అభిప్రాయపడ్డారు.
తన జీవిత తత్త్వం గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ, “నేను నా జీవితంలో ఎప్పుడూ దేనికీ పశ్చాత్తాప పడను. అదే అందం” అని స్పష్టం చేశారు. చాలా మంది తమ కష్టాలను చెప్పుకొని సానుభూతి కోరుకుంటారు కానీ, ఆమె సంతోషంగా జీవిస్తున్నారని, ఎందుకంటే ఆమెకు ఎలాంటి పశ్చాత్తాపాలు లేవని జగపతిబాబు వివరించారు. మన నియంత్రణలో ఉన్న వాటిపైనే దృష్టి పెట్టాలని, అయిపోయిన వాటి గురించి చింతించకూడదని రమ్యకృష్ణ హితవు పలికారు. వర్తమానాన్ని గరిష్ఠంగా ఉపయోగించుకొని, సంతోషంగా, నవ్వుతూ జీవించాలని ఆమె సందేశమిచ్చారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసిన తర్వాత మాత్రమే ఇటువంటి పరిపక్వత వస్తుందని, గత కష్టాల గురించి మాట్లాడుతూ కూర్చోకుండా, వర్తమానంలో జీవించాలని ఆమె అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..