Maya Lady Review: మాయలేడి సినిమా రివ్యూ.. కన్ఫ్యూజింగ్ స్టోరీ మెప్పించిందా లేదా..?
'బాహుబలి', 'జితేందర్ రెడ్డి' లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాకేష్ వర్రె, ఇప్పుడు తన సొంత నిర్మాణంలోనే హీరోగా నటించిన కొత్త చిత్రం 'మాయలేడి'. ప్రిశంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజర్లు, పోస్టర్లతో ముందు నుంచే మంచి బజ్ తెచ్చుకుంది. మరి ఈ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ జనాలను ఏ రేంజ్లో అట్రాక్ట్ చేసిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

మూవీ రివ్యూ: మాయలేడి
నటీనటులు: రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, సత్య, ఇంద్రజ, సురేష్, వినోద్ కిషన్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: యేదు రాధాకృష్ణన్
ఎడిటింగ్: రవితేజ గిరిజాల
నిర్మాత: రాకేష్ వర్రే (క్రేజీ యాంట్స్ ఎంటర్టైన్మెంట్స్)
దర్శకుడు: ప్రశాంకర్
కథ:
మహిళలకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించే మాస్టర్ క్రిష్ (రాకేష్ వర్రె). అతనికి ఎదుటివారికి సాయం చేసే గుణం ఉన్న ఆశా (మధుమిత సర్కార్) పరిచయం అవుతుంది. ఆమె మంచితనం చూసి ఫ్లాట్ అయిపోయిన హీరో, మెల్లిగా ఆమెతో ప్రేమలో పడతాడు. తీరా ఆమెకు దగ్గరయ్యాక క్రిష్‌కు ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. తనతో ఉన్నది సాఫ్ట్ క్యారెక్టర్ ఆశా కాదని, మాస్ అండ్ రఫ్ ఆటిట్యూడ్ ఉన్న ఆమె కవల సోదరి రూప అని తెలుసుకుంటాడు. అసలు ఈ ఇద్దరిలో క్రిష్ ఎవరికి దగ్గరయ్యాడు? ఆశాను కాదని రూపను పెళ్లాడాడా? చివరకు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
కథనం:
ఈ కథ వినగానే మనకు వెంటనే విక్రమ్ బ్లాక్ బస్టర్ ‘అపరిచితుడు’ సినిమా గుర్తుకు రావడం ఖాయం. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఇది ఫీమేల్ వెర్షన్ అని అనుకోవచ్చు. అపరిచితుడు, చంద్రముఖి లాంటి హిట్ సినిమాల స్ఫూర్తితో దర్శకుడు ప్రిశంకర్ ఈ స్టోరీ లైన్ రాసుకున్నాడు. ఒక సీరియస్ పాయింట్‌కు కామెడీని జోడించి చెప్పడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదా సన్నివేశాలతో చాలా స్పీడ్‌గా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ దగ్గర ఆశా, రూప ఇద్దరూ వేరు కాదు ఒక్కరే అని రివీల్ చేసి ఇచ్చిన ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీ పెంచుతుంది.
అయితే ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం మనం రెగ్యులర్‌గా చూసే సినిమాల్లాగే రొటీన్‌గా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడం, ఆ డిప్రెషన్ నుంచి హీరోయిన్లో ‘మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ రావడం.. తనను ఇబ్బంది పెట్టిన వాళ్లపై ఆ రెండో క్యారెక్టర్ (రూప) ఎదురుతిరగడం లాంటివి పాత సినిమాలను తలపిస్తాయి. కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినా కూడా, ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెట్టేలా సీన్స్ డిజైన్ చేయడంలో దర్శకుడు తన మార్క్ చూపించాడు. సినిమా మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్సులు మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి. కమెడియన్ సత్యతో ఫస్ట్ హాఫ్‌లో నవ్వించిన డైరెక్టర్, సెకండ్ హాఫ్‌ను మాత్రం కాస్త సీరియస్‌గా, స్లోగా నడిపించి కాస్త బోర్ కొట్టించాడు. ఇంకొన్ని బలమైన మలుపులు రాసుకుని ఉంటే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మరో స్థాయిలో ఉండేది. అయినా సరే ‘మాయలేడి’ అనే పేరుకు మాత్రం స్క్రీన్ ప్లే పక్కాగా న్యాయం చేసింది.
నటీనటులు:
గత చిత్రాల్లో సీరియస్ రోల్స్ చేసిన రాకేష్ వర్రె, ఈ సినిమాలో ఒక రొమాంటిక్ బాయ్ లాగా తన లుక్, యాక్టింగ్ పూర్తిగా మార్చేశాడు. ఎమోషనల్ సీన్స్‌తో పాటు ముఖ్యంగా క్లైమాక్స్‌లో అతని నటన ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్ మధుమిత సర్కార్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న యువతిగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. గ్లామర్‌గా కనిపిస్తూనే రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో జీవించేసింది. హాస్య నటుడు సత్య తనదైన పంచులతో నవ్వించాడు. తండ్రి పాత్రలో సురేష్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగా, హీరోయిన్ బాగోగులు చూసుకునే డాక్టర్ క్యారెక్టర్లో సీనియర్ నటి ఇంద్రజ తన అనుభవంతో మెప్పించింది. మిగిలిన సపోర్టింగ్ క్యాస్ట్ అంతా కథకు తగ్గట్లుగా నటించారు.
టెక్నికల్ టీం:
సాంకేతికంగా సినిమా డీసెంట్‌గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కు బాగా ప్లస్ అయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి సెకండ్ హాఫ్‌లో కొన్ని సాగదీత సీన్లను ట్రిమ్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకా బెటర్‌గా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా బడ్జెట్‌కు తగ్గట్లుగా రిచ్‌గానే ఉన్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ‘మాయలేడి’.. థియేటర్లలో టైమ్ పాస్ చేసే లేడీ అపరిచితుడు!




