అప్పట్లో తిరుగులేని హీరో.. తినడానికి తిండి లేక ఎన్నో కష్టాలు.. ఇప్పుడు ఇలా
నటుడు ప్రేమ్ సాగర్ తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్నారు. తల్లిదండ్రుల మరణం, కుటుంబ బాధ్యతలు తన సినీ కెరీర్‌కు ఎలా అడ్డుతగిలాయో వివరించారు. ఎం.కామ్, లా చదివిన ఆయన, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి, ప్రభుత్వ ప్లీడర్‌గా పనిచేశారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పడిన కష్టాలు, ఆకలి రోజులను గుర్తుచేసుకున్నారు.

నటుడు ప్రేమ్ సాగర్ రాజులపాటి తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 41 ఏళ్ల వయస్సులో నాగార్జున, అమల నటించిన ప్రేమ యుద్ధం సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందిన ఆయన, అప్పట్లో ఇంకొక శోభన్ బాబుగా ప్రశంసలు అందుకున్నారు. అయితే, ఆయన సినీ ప్రస్థానం అనుకోని మలుపులు తిరిగింది. తల్లిదండ్రుల ఆకస్మిక మరణం ప్రేమ్ సాగర్ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ షాక్‌తో ఆయన సినిమాలకు దూరమై, కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకోవాల్సి వచ్చింది. వెంటనే పెళ్లి చేసుకోవడం, తన తమ్ముడికి పెళ్లి చేయడం వంటి బాధ్యతలు ఆయన సినీ కెరీర్‌కు తాత్కాలికంగా ముగిసిపోయింది. ఎం.కామ్, లా చదివిన ప్రేమ్ సాగర్, మొదట్లో సినిమాల్లోకి రావడం ఒక ప్రయోగంలా భావించారట. ఒకవేళ సినిమాల్లో విజయం సాధించకపోతే న్యాయవాద వృత్తిలో స్థిరపడదాం అనే ఆలోచనతోనే సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మద్రాస్ హైకోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టి, మధురై హైకోర్టుకు కూడా వెళ్లి వచ్చేవారు. పెళ్లైన తర్వాత హైదరాబాద్‌కు మారిన ఆయన, పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో బంధువుల ప్రోత్సాహంతో ఇక్కడ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆదాయపు పన్ను న్యాయవాదిగా పనిచేస్తూనే, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్‌గా అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రభుత్వ ప్లీడర్‌గా సేవలందించారు. నిరంతరం ప్రభుత్వ ప్లీడర్‌గా పనిచేస్తూ, వృత్తిలో ఎంతో అనుభవం సంపాదించారు.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, భార్యామణి సీరియల్ ద్వారా ప్రేమ్ సాగర్ మళ్లీ నటనలోకి అడుగుపెట్టారు. న్యాయవాదిగా మంచి పేరు, ఆదాయం ఉన్నప్పటికీ, ఏదో తెలియని ఆకర్షణతో ఆయన మళ్లీ నటన వైపు మొగ్గు చూపారు. డీఎన్ఆర్ కాలేజీలో తన సీనియర్, కో-డైరెక్టర్ రాఘవేంద్ర రావు ద్వారా బాలనాగమ్మ మ్యూజిక్ ఆల్బమ్‌లో నవభోజరాజు పాత్రకు ఎంపికయ్యారు. రీటేకులు, రిహార్సల్స్ లేకుండా ఆయన చేసిన నటనకు దర్శకనిర్మాతలు ముగ్ధులయ్యారు. సినిమాల్లోకి రావడానికి ముందు ఆయన ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు వర్ణనాతీతం. నెలకు కేవలం రూ. 1000 స్టైఫండ్‌తో చెన్నైలో గడిపేవారు.
మెస్ టికెట్లు ఆదా చేసుకోవడానికి ఒకపూట మాత్రమే భోజనం చేసి, కొన్నిసార్లు ఆకలితో అలమటించేవారు. ఒక నెల మెస్ టికెట్లను నాలుగు నెలల పాటు ఉపయోగించుకునేలా ఆయన తన ఆహారపు అలవాట్లను మార్చుకున్నారు. ఈ కష్టాల తర్వాతే ఆయనకు హీరోగా అవకాశం లభించింది.ప్రేమ్ సాగర్‌కు మిలిటరీ అంటే ఎంతో ఇష్టం. తన తండ్రి రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు, వార్ మెడలిస్ట్ కావడంతో ఆయన స్ఫూర్తితో మిలిటరీలో చేరాలని కలలు కనేవారు. ఎం.కామ్ పూర్తయ్యాక, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా ఎంపికైనా, అప్పటికే తన తమ్ముడు సైన్యంలో ఉండటంతో, ఇద్దరూ వెళ్లిపోతే మాకు ఎవరుంటారు అని తల్లి అడిగిన మాటతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. అంతేకాకుండా, గ్రూప్-2 పరీక్షలో ఎస్.ఐ. పోస్ట్, గ్రూప్-1 పరీక్షలో డీఎస్పీ పోస్ట్ వచ్చినప్పటికీ, పోలీసు ఉద్యోగం పట్ల ఆసక్తి లేకపోవడంతో వాటిని కూడా నిరాకరించారట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
