ఇదేనా మీ తీరు ? ఢిల్లీ పోలీసులతీరుపై హైకోర్టు మండిపాటు

బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన రెచ్చగొట్టే, విద్వేష పూరిత ప్రసంగాల తాలూకు ఫుటేజీని తాము చూడలేదంటూ ఓ సీనియర్ పోలీసు అధికారి ఇఛ్చిన సమాధానంపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్. మురళీధర్ మండిపడ్డారు.

ఇదేనా మీ తీరు ? ఢిల్లీ పోలీసులతీరుపై హైకోర్టు మండిపాటు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 26, 2020 | 4:57 PM

బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన రెచ్చగొట్టే, విద్వేష పూరిత ప్రసంగాల తాలూకు ఫుటేజీని తాము చూడలేదంటూ ఓ సీనియర్ పోలీసు అధికారి ఇఛ్చిన సమాధానంపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్. మురళీధర్ మండిపడ్డారు. అసలు మీరు ఈ ఫుటేజీని చూశారా అని ఆయన ప్రశ్నించినప్పుడు తాము చూడలేదని డీసీపీ (క్రైమ్ బ్రాంచ్) రాజేశ్ దేవ్ జవాబిచ్చారు. నేను ఇతర బీజేపీ నాయకులు  అనురాగ్ ఠాకూర్, పర్వేశ్ వర్మల స్పీచ్ ల తాలూకు వీడియోలు చూశానని, కానీ కపిల్ మిశ్రా ఫుటేజీని చూడలేదని రాజేశ్ దేవ్ అన్నారు. దీంతో ఆ జడ్జి.. మీ పోలీసుల తీరు తనకెంతో ఆశ్చర్యంగా ఉందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీ కమిషనర్ కార్యాలయంలో ఎన్నో టీవీలు ఉంటాయి కదా అన్నారు. కపిల్ మిశ్రా ప్రసంగ వీడియోను ప్లే చేయవలసిందిగా ఆయన కోర్టు సిబ్బందిని ఆదేశించారు.

కపిల్ ఎక్కడ, ఏ ప్రాంతంలో మాట్లాడారు.. ఆ సమయంలో ఎంతమంది పోలీసులు అక్కడ ఉన్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను న్యాయమూర్తి ప్రశ్నించగా.. తాను టీవీ చూడలేదని, న్యూస్ పేపర్లలో వఛ్చిన వార్తల ఆధారంగా సమాధానం ఇవ్వలేనని ఆయన (మెహతా) అన్నారు. ఈ సమాధానం పట్ల జస్టిస్ మురళీధర్ తీవ్రంగా స్పందిస్తూ.. ఈ విధమైన వార్తల పట్ల నిర్లక్ష్యం తగదని అన్నారు. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లకు కారకులైనవారిపై ఎఫ్ ఐ ఆర్ లు దాఖలు  చేసి, అరెస్టు చేయాలని  కోరుతూ ఫైలయిన పిటిషన్లను న్యాయమూర్తులు మురళీధర్, తల్వంత్ సింగ్ విచారించిన సందర్భంగా ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. న్యాయమూర్తులు అడిగిన ప్రతి ప్రశ్నకూ వీరు తెలియదని చెప్పడం విశేషం. చూడబోతే… తాము ఏ సమాధానం చెబితే ఏ ముప్పు వస్తుందో, ఆ తరువాత ఈ బీజేపీ నేతలనుంచి ఎలాంటి పరిణామాలు, బెదిరింపులు ఎదుర్కోవలసి వస్తుందో, తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడతాయో అనే భయంతోనే ఈ సీనియర్ పోలీసు అధికారి  తన నోటికి  ‘తాళాలు’ వేసుకున్నట్టు కనిపిస్తోంది.

Latest Articles