ప్రపంచంలో ఎవరికి ఏది ఊరకె రాదు. అందులోనూ డబ్బయితే అసలే రాదు. కానీ కొందరు మాత్రం ఎదుటి వారు చమట చిందించి కష్ట పడిన డబ్బులు మోసాలు చేసి సంపాదిస్తున్నారు. ఆ మోసాలు కూడా చదువు రాని నిరుపేదల దగ్గర అనుకుంటే పొరపాటే కొందరు బిజినెస్ మ్యాన్లు, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లతో పాటు బాగా చదువుకుని మోసాలపై అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఏదో రూపంలో సైబర్ నేర గాళ్ల ఉచ్చులో పడి లక్షల రుపాయలు పోగొట్టుకుంటున్నారు. కొందరు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఎంతో మంది సైబర్ నేర గాళ్ల చేతిలో మోసపోయి లక్షల రూపాయలు పోగొట్టుకుని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే సైబర్ మోసాలపై కంప్లైంట్స్ వందల్లో వున్నా రికవరీలు మాత్రం రెండు అంకెలకు మించడం లేదు. అయితే సైబర్ నేర గాళ్ల చేతిలో మోసపోయి బాధపడటం కంటే అలాంటి మోసాలను ముందుగానే గుర్తించి అలాంటి మోసాల బారిన పడకుండా వుండాలని పోలీసులు పదే పదే చెప్తున్నారు. అయితే మోసాలను మాత్రం ఆపలేక పోతున్నారు. కానీ ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మోసాలను అరికట్ట వచ్చు అనేది పోలీసుల మాట.
ఇటీవల కాలంలో జరిగిన కొన్ని మోసాలను చూస్తే.. ఖాళీ సమయాలలో అదనపు ఆదాయం ఆర్జించమంటూ పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేద్దమనుకునే వారినే లక్ష్యంగా చేసుకొని కొత్త పంథాలో నేరాలకు పాల్పదుతున్నారు సైబర్ నేరగాళ్లు. అలాగే క్రిప్టో కరెన్సీ స్కాం.. రిమోట్ యాక్సెస్ ఫ్రాడ్.. అంటూ సరి కొత్త ఎత్తుగడతో ప్రజలను దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు. తక్కువ సమయంలో సులువుగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశను సైబర్ నేరగాళ్లు అస్త్రంగా ఎంచుకుంటున్నారు. అలాగే తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి ప్రీ పెయిడ్ టాస్క్‌ల ఫ్రాడ్ ద్వారా 13 లక్షలు పోగొట్టుకున్నాడు. మరో వ్యక్తి నకిలీ వెబ్ సైట్స్‌లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ద్వారా 10 లక్షలు పోగొట్టుకున్నాడు. చివరికి అందరూ నిత్యం చేసే యూటూబ్‌లో వీడియోలకు లైక్స్, రివ్యూల ద్వారా అధిక నగదు సంపాదించవచ్చని మరో వ్యక్తి రూ. 9.5 లక్షలు పోగొట్టుకున్నాడు. అలాగే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే అధిక నగదు సంపాదించవచ్చని 3.5 లక్షలు కోల్పోయారు.
ఇక ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రాం ద్వారా అపరిచిత వ్యక్తులు స్నేహితులుగా మారి ఫారెన్ నుండి గిఫ్ట్స్ పంపుతున్నామని నమ్మించి లక్షలు కాజేశారు. ఇలాంటి ఫ్రాడ్‌లను ముందుగా గుర్తిస్తే మోసాల బారి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. ఎవరు కూడా తప్పుడు మెయిల్స్‌ని క్రియేట్ చేయకూడదని వ్యక్తిగత సమాచారం జాగ్రత్తగా ఉంచుకోవాలని బ్యాంక్ అకౌంట్ నంబర్‌లు, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్‌లు లేదా గుర్తింపు పత్రాల కాపీలు వంటి సున్నితమైన వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దు అంటున్నారు. సైబరు నేరగాళ్ళ చేతుల్లో మోసపోయినపుడు ఎటువంటి భయం లేకుండా పోలీసులను ఆశ్రయించాలన్నారు. జిల్లాలో పోలీస్ యంత్రాంగం 24×7 అందుబాటులో ఉన్నారని పోలీసులను కుటుంబ సభ్యులవలె భావించి సమస్యలను తెలియపరచి పరిష్కరించుకోవాలన్నారు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి. సైబర్ నేరాలు ఇతర ఆన్లైన్ మోసాల బారిన పడిన వారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సైబర్ మిత్ర వాట్సాప్ నంబరును 9121211100, 1930, NCRP Portal అయిన cybercrime.gov.in లకు సమాచారం తెలియజేయాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…