ఒక్క బ్లాస్టింగ్‌తో వికారాబాద్ జిల్లా పెద్దేముల్ గ్రామం చిగురుటాకులా వణికిపోయింది. పేలుళ్ల వెనుక మర్మమేంటని పోలీసులు ఆరాతీస్తే.. ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు బయటపడ్డాయి. 3వేల డిటోనేటర్లు, 1200 జిలెటిన్ స్టిక్‌లతో పాటు వేర్వేరు కెమికల్స్ దొరికాయి. జనావాసాల మధ్య ఇంత భారీ ఎత్తున పేలుడు పదార్థాలు నిల్వలతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.
చిన్న పేలుడుతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ అవి వరుస పెట్టి పేలితే.. ఇరిగేషన్ ఆఫీస్ నామారూపాల్లేకుండా పోయేది. ఊరంతా వల్లకాడు అయ్యేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవి ఎంతకాలంగా నిల్వ ఉన్నాయి.. అసలు ఎవరు స్టోర్ చేశారన్నది మిస్టరీగా మారింది.
మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్ట్ 1965లో నిర్మించగా ఇప్పటివరకు ఇరిగేషన్ భవనంలో పేలుడు పదార్థాలను నిల్వ చేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇరిగేషన్ శాఖ అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. శిథిలావస్థకు చేరిన భవనాన్ని జూనియర్ కాలేజీకి 10ఏళ్ల క్రితమే అప్పగించామంటున్నారు. అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాత్రం తమకు భవనం అప్పగించినప్పటికీ ఇంకా స్వాధీనం చేసుకోలేదని చెబుతున్నారు. దీంతో పేలుడు పదార్థాల నిల్వకు కారణం ఎవరన్నది అంతుపట్టడం లేదు.
మరోవైపు అక్రమ పేలుళ్లకి పెద్దేముల్ కేరాఫ్‌గా మారింది. పరిసర గ్రామాల్లో ఖనిజ సంపదను తరలించేందుకు మైనింగ్ మాఫియా అక్రమ పేలుళ్లకి పాల్పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. పోలీస్, మైనింగ్ శాఖల నిఘా కొరవడడంతో మాఫియా అరాచకాలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా కొనసాగుతున్నాయి.
మైనింగ్ మాఫియా డే అండ్ నైట్ అక్రమ పేలుళ్లకు పాల్పడుతూ కోట్లు గడిస్తోంది. ఖనిజ సంపద ఇంత దర్జాగా తరలిపోతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీస్తున్నారు పెద్దేముల్ గ్రామస్థులు.
ఇవి కూడా చదవండి: Marine Srinivas: మిస్టరిగా మైరెన్ ఉద్యోగి శ్రీనివాస్ మిస్సింగ్.. ఆ యువతిపైనే అనుమానాలు..
TS Transco Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. JLM పోస్టులకు రూట్ క్లియర్.. ఇలా దరఖాస్తు చేసుకోండి..