Deputy Sarpanch family Suicide attempt : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ ప్రజా ప్రతినిధి కుటుంబం బలవన్మరణానికి ప్రయత్నించింది. చేసిన అప్పులు తీర్చలేక గ్రామ ఉపసర్పంచ్ తన కుటుంబంతోసహా ఆత్మహత్యకు యత్నించాడు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం ఒడియాతండాలో శనివారం ఈ ఘటన జరిగింది. ఒడియాతండా ఉప సర్పంచ్ బాబూరావు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. తన అవసరాల కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. చేసిన అప్పులు తీర్చాలంటూ ఒత్తిడి పెరిగింది. డబ్బుల వచ్చే మార్గం కనిపించక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు బాబురావు. దీంతో తీవ్ర మనస్తాపంతో బాబూరావు దంపతులు మధ్యాహ్నం ఇంట్లో ఇద్దరు చిన్నారులకు క్రిమిసంహారక మందు తాగించి తామూ సేవించారు. దీంతో నలుగురు అపస్మారకస్థితికి చేరుకున్నారు.
ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన ఆ కుటుంబాన్ని చికిత్స నిమిత్తం ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వారిని తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి… డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ ఆర్టిస్ట్ .. ఫుల్లుగా మద్యం సేవించి పోలీసులకు చిక్కిన కమెడియన్..