కరోనా వైరస్ చికిత్సకోసం డెవలప్ చేస్తున్న ‘కోవ్యాక్సీన్’ తయారీకి ఏడాదికి పైగా కాలం పడుతుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. అంతవరకు తమకు వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆగస్టు 15 నాటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులో ఉంటుందని ఐసీఎంఆర్ చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది. ఒక డెడ్ లైన్ పెట్టి వ్యాక్సీన్ తయారు చేయాలని కోరడం ఎంతవరకు సబబని కొందరు డాక్టర్లే సందేహాలు వ్యక్తం చేయగా.. విపక్షాలు ఇది రాజకీయంతో కూడుకున్నదని ఆరోపించాయి. కాగా- హ్యూమన్ ట్రయల్స్ పూర్తి చేయడానికి తమకు 15 నెలల సమయం అవసరమవుతుందని భారత్ బయో టెక్ పేర్కొంది. ఈ విషయాన్ని క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీకి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. ట్రయల్ ప్రోటోకాల్ ప్రకారం తదుపరి ప్రొసీజర్స్ కోసం ఆరు నెలలు పడుతుందని ఈ సంస్థ వెల్లడించింది. అసలు క్లినికల్ ట్రయల్స్ కే సుమారు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని భారత్ బయోటెక్ సంస్థ అధికారులు తెలిపారు.
తొలిదశ క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రస్తుతం వలంటీర్ల రిజిస్ట్రేషన్ జరుగుతోందని వారు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో చేతులు కలిపిన కొన్ని సంస్థలకు ఇంకా ‘ఎథికల్ క్లియరెన్స్’ అందవలసి ఉందని వారన్నారు. మొదటి దశలో 18-55 ఏళ్ళ మధ్య వయస్సు గల 375 మందికి, రెండో దశలో 12-65 ఏళ్ళ మధ్య వయస్సు గల 750 మందికి వ్యాక్సీన్ ఇవ్వవలసి ఉంటుంది. తొలి దశ వ్యాక్సీన్ ఇచ్చాక.. 28 రోజుల అనంతరం దీని సేఫ్టీ, ఇమ్యూనిటీ తెలుస్తుందని ఈ సంస్థ వర్గాలు తెలిపాయి.