
హైదరాబాద్, ఆగస్ట్ 17: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) జూన్ 2026 పరీక్షలకు సంబంధించి ఏకంగా మూడు సబ్జెక్టులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసింది. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలను తిరిగి నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మూడు పేపర్లలో పలు తప్పులు, లోపాలు ఉన్నాయంటూ అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు NTA వెల్లడించింది. UGC NET జూన్ 2026 పరీక్షలను NTA జూన్ 22 నుంచి 30 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం జూలై 5, 2026న రీ-టెస్ట్ నిర్వహించింది. మొత్తం 87 సబ్జెక్టులకు ఈ పరీక్షలు జరిగాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. అయితే ఇందులో ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ పేపర్లలో అనేక తప్పులు ఉన్నాయని NTAకు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ లోపాలను పరిశీలించేందుకు NTA ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సమగ్రంగా పరిశీలించిన అనంతరం మూడు పేపర్లలో పలు రకాల తప్పులు ఉన్నట్లు గుర్తించింది.
కమిటీ నివేదిక ప్రకారం.. ప్రశ్నపత్రాల్లో ప్రముఖ పండితుల పేర్లలో స్పెల్లింగ్ తప్పులు, పుస్తకాల పేర్లలో లోపాలు, ప్రశ్నల పదబంధాల్లో తప్పులు, వ్యాకరణ దోషాలు, లింగం-వచన అన్వయంలో పొరపాట్లు, విరామ చిహ్నాల తప్పులు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న భావాలకు ప్రామాణికం కాని పదాలను ఉపయోగించడం, గతంలో అడిగిన ప్రశ్నల్లో గణనీయమైన సంఖ్యలో ప్రశ్నలను మళ్లీ ఇవ్వడం వంటి లోపాలు కూడా ఉన్నట్లు కమిటీ గుర్తించింది. అభ్యర్థులందరికీ న్యాయమైన, లోపాలు లేని పరీక్షను నిర్వహించడం అవసరమని భావించిన కమిటీ.. ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ మూడు పేపర్లను తిరిగి నిర్వహించాలని సిఫార్సు చేసింది. కమిటీ నివేదిక ఆధారంగా NTA రీ-కండక్ట్‌కు నిర్ణయం తీసుకుంది.
NTA ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మూడు సబ్జెక్టుల పరీక్షలు కింది తేదీల్లో జరుగుతాయి..
ఈ మూడు సబ్జెక్టులకు చెందిన అభ్యర్థుల నుంచి రీ-కండక్ట్ పరీక్ష కోసం ఎలాంటి అదనపు పరీక్ష ఫీజు వసూలు చేయబోమని NTA స్పష్టం చేసింది. పరీక్ష నగరం, పరీక్ష కేంద్రం, అడ్మిట్ కార్డుకు సంబంధించిన వివరాలను తదుపరి దశలో అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెల్లడిస్తామని తెలిపింది. మరోవైపు NTA 84 సబ్జెక్టులకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీలను విడుదల చేసింది. ఈ 84 సబ్జెక్టులకు సంబంధించిన UGC NET 2026 ఫలితాలను నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ప్రకటిస్తామని NTA తెలిపింది. అలాగే ఇంగ్లిష్, కామర్స్, సోషియాలజీ సబ్జెక్టులకు రీ-కండక్ట్ పరీక్ష నిర్వహిస్తున్న కారణంగా మిగిలిన 84 సబ్జెక్టులకు సంబంధించిన JRF సీట్ల కేటాయింపు, ఈ-సర్టిఫికెట్ల జారీ ఆలస్యం కాదని NTA స్పష్టం చేసింది. అభ్యర్థులు రీ-కండక్ట్ పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం, పరీక్ష కేంద్రం, సిటీ ఇంటిమేషన్ స్లిప్, అడ్మిట్ కార్డు వంటి వివరాల కోసం NTA అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించింది.