నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 544 లెక్చరర్‌ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్

రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కసరత్తు చేస్తోంది. సహాయ ఆచార్యులు/అధ్యాపకులు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లకు సంబంధించిన మొత్తం 544 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని..

నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 544 లెక్చరర్‌ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్
TGPSC Degree Lecturer Recruitment

Updated on: Sep 24, 2026 | 6:37 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కసరత్తు చేస్తోంది. సహాయ ఆచార్యులు/అధ్యాపకులు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లకు సంబంధించిన మొత్తం 544 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (జీఓ) ఆధారంగా నియామక విధానంలో కొన్ని మార్పులు చేయనున్నారు. ఇటీవల టీజీపీఎస్సీలో జరిగిన సమావేశంలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి రెండు, మూడు అంశాలపై స్వల్ప మార్పులు సూచించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను విద్యాశాఖ ఉన్నతాధికారులు కమిషన్‌కు పంపించినట్లు ఓ అధికారి తెలిపారు.

2013 తర్వాత మళ్లీ భర్తీ

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టులను చివరిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో భర్తీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 491 అధ్యాపకులు, 24 లైబ్రేరియన్లు, 29 ఫిజికల్‌ డైరెక్టర్ల పోస్టులు కలిపి మొత్తం 544 ఖాళీల భర్తీకి 2022 డిసెంబరులో నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే ఆ నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా యూజీసీ మార్గదర్శకాలను పాటించలేదని, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులకు సంబంధించిన విద్యార్హతల విషయంలో అభ్యంతరాలు రావడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. పాత నోటిఫికేషన్‌లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండేది. అయితే ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 12న జీఓ-4 జారీ చేసింది. కొత్త విధానం ప్రకారం అభ్యర్థుల ఎంపికలో అకడమిక్‌ ప్రతిభకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అకడమిక్‌ ప్రతిభ – 50 మార్కులు, రాత పరీక్ష – 40 మార్కులు, ఇంటర్వ్యూ – 10 మార్కులు చొప్పున మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు సమాచారం. కొత్త జీఓకు అనుగుణంగా నోటిఫికేషన్‌లో నిబంధనలు, అర్హతలకు సంబంధించిన అంశాలను పొందుపరచనున్నారు.

రాష్ట్రంలో పెరిగిన డిగ్రీ కళాశాలలు

రాష్ట్రంలో మూడేళ్ల క్రితం 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 150కి పెరిగింది. వీటిలో అధ్యాపకులు, లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లకు కలిపి మొత్తం 4,098 మంజూరు పోస్టులు ఉన్నాయి. స్తుతం సుమారు 1500 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు, 2000 మంది అతిథి అధ్యాపకులు, సుమారు 400 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నట్లు సమాచారం. దీంతో కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరత కొనసాగుతోంది.

మరో 1000 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు

రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కొత్తగా కనీసం 2,000 పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం 544 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఉండటంతో తొలుత ఆ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు మరో 1000 ఖాళీల భర్తీకి ఆమోదం ఇవ్వాలని కళాశాల విద్యాశాఖ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే, వాటి భర్తీకి ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో కొత్త నోటిఫికేషన్‌పై ఆసక్తి నెలకొంది. టీజీపీఎస్సీ అధికారికంగా నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, దరఖాస్తు తేదీలపై స్పష్టత రానుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us