
హైదరాబాద్, ఆగస్ట్ 7: వైద్య విద్యను లక్ష్యంగా పెట్టుకున్న గిరిజన (ST) విద్యార్థులకు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGTWREIS) కీలక అవకాశం కల్పించింది. NEET UG-2027 పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఉచిత దీర్ఘకాలిక కోచింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనుంది. ఈ ఉచిత శిక్షణకు అర్హులైన షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 15గా ప్రకటించింది. TGTWREIS ప్రకటన ప్రకారం ఈ కోచింగ్ ప్రోగ్రామ్‌లో సీట్లు పరిమితంగా ఉన్నాయి. విద్యార్థుల ఎంపిక పూర్తిగా NEET UG-2026 మార్కులు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి అర్హత కలిగిన బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. 2026లో ఇంటర్మీడియట్ (BiPC) పూర్తి చేసి ఉండాలి. TGTWR సంస్థలు లేదా ఏదైనా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి చదివి ఉండాలి. NEET UG-2026లో కనీసం 200 మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థి షెడ్యూల్డ్ ట్రైబ్ (ST) వర్గానికి చెందినవారై ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేక కేంద్రాల్లో శిక్షణ అందించనున్నారు.
కోచింగ్ పొందే సమయంలో ఎంపికైన విద్యార్థులు సంబంధిత TGTWR డిగ్రీ కళాశాలల్లో తప్పనిసరిగా డిగ్రీ కోర్సులో చేరాల్సి ఉంటుంది. ప్రవేశాలు పూర్తిగా NEET UG-2026 స్కోర్ల ఆధారంగా, సీట్ల లభ్యతను బట్టి జరుగుతాయని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు తమ దరఖాస్తుతో పాటు NEET UG-2026 స్కోర్ కార్డు, అవసరమైన విద్యా ధ్రువపత్రాలు, ఇతర సంబంధిత సర్టిఫికెట్లు ఆగస్ట్ 15, 2026వ తేదీలోపు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను బాలురు, బాలికల కోసం కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో లేదా హైదరాబాద్ మసాబ్ ట్యాంక్‌లోని TGTWREIS ప్రధాన కార్యాలయం, DSS భవన్లో సమర్పించవచ్చు. వైద్య విద్యలో ప్రవేశం కోసం పోటీ పెరుగుతున్న నేపథ్యంలో, గిరిజన విద్యార్థులకు ఉచిత NEET కోచింగ్ అందించడం ద్వారా వారి కలలను సాకారం చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. సరైన శిక్షణ, మార్గదర్శకత్వంతో మరిన్ని మంది ST విద్యార్థులు వైద్య రంగంలోకి రావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.