నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్య ఆరోగ్య శాఖలో 2,929 ఉద్యోగాల భర్తీకి కసరత్తు!
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో అవకాశం అందుబాటులోకి రానుంది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 2,929 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నియామకాలకు సంబంధించి ఇప్పటికే కొన్ని పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం లభించగా, మరికొన్ని పోస్టులకు అనుమతులు రావాల్సి ఉంది. అనుమతుల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు..

హైదరాబాద్, నవంబర్ 10: వైద్య ఆరోగ్య శాఖలో గుర్తించిన మొత్తం 2,929 ఖాళీల్లో 996 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. వీటిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 198, ఆయుష్ ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు 308 ఉన్నాయి. అదేవిధంగా టెక్నీషియన్ పోస్టులు 290, బయోమెడికల్ ఇంజినీర్లు 14, ఫిజియోథెరపిస్టులు 46, రేడియోగ్రాఫర్లు 11, ల్యాబ్ టెక్నీషియన్లు 73, ఏఎన్ఎంలు 54 పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, వైద్య విద్య సంచాలకుల కార్యాలయం, ఆయుష్, ఎంఎన్‌జే, ఐపీఎం తదితర విభాగాల్లో భర్తీ చేయనున్నారు.
ఆర్థిక శాఖ ఆమోదం కోసం మరో 1,933 పోస్టులు
మిగిలిన 1,933 పోస్టుల భర్తీకి ఇంకా ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉంది. వీటిలో ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో 134 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, వైద్య విద్య సంచాలకుల పరిధిలో 288 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 716 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 148 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 194 స్టాఫ్ నర్సులు, 96 ల్యాబ్ టెక్నీషియన్లు, 119 జూనియర్ అసిస్టెంట్లు, 238 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని ప్రతిపాదించారు. ఆర్థిక శాఖ అనుమతులు వచ్చిన తర్వాత పోస్టులవారీగా ఖాళీలను ఖరారు చేసి నియామక ప్రక్రియను ప్రారంభించనున్నారు. మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలు మాత్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) ద్వారా చేపట్టనున్నట్లు సమాచారం.
మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 2,711 పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ పరిధిలోని 1,931 ఎంపీహెచ్‌ఏ (ఫీమేల్) పోస్టుల భర్తీ దాదాపు పూర్తయింది. త్వరలో తుది ఎంపిక జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్-2కు సంబంధించిన 732 పోస్టుల నియామకాలు చివరి దశకు చేరుకున్నాయి. సాంకేతిక కారణాలతో ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగింది. మరోవైపు 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఎంపికకు కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ పోస్టుల కోసం 4 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో వాటి పరిశీలన, వెయిటేజీ మార్కుల లెక్కింపునకు సమయం పడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటివరకు 13,401 పోస్టులను భర్తీ చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా మరో 2,929 పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభం కావడంతో వైద్య రంగంలో ఉద్యోగ అవకాశాలు మరింత పెరగనున్నాయి. ఆర్థిక శాఖ అనుమతులు, తదుపరి నియామక ప్రక్రియపై నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




