ఆ ప్రభుత్వ బడిలో అద్భుతం.. నాలుగేళ్ళలో ఏకంగా 40 MBBS సీట్లు సాధించిన విద్యార్ధులు!

ఒకప్పుడు చదువుకు దూరమయ్యే పరిస్థితుల్లో ఉన్న పేదింటి ఆడపిల్లలు.. నేడు వైద్య విద్యను అభ్యసించే స్థాయికి చేరుకున్నారు. ధోబీలు, పశువుల కాపర్లు, రైతు కూలీల కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థినులకు అండగా నిలిచిన ఉపాధ్యాయులు అద్భుతాన్ని సృష్టించారు. తమ సొంత డబ్బులతో నీట్ కోచింగ్ ఇప్పించి ఏకంగా 40 మంది విద్యార్థినులకు ఎంబీబీఎస్ సీట్లు సాధించేలా చేశారు. తమిళనాడులోని ఓ ప్రభుత్వ పాఠశాల సాధించిన ఈ విజయం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది..

ఆ ప్రభుత్వ బడిలో అద్భుతం.. నాలుగేళ్ళలో ఏకంగా 40 MBBS సీట్లు సాధించిన విద్యార్ధులు!
40 Poor Girls Secure MBBS Seats Through NEET Coaching

Updated on: Nov 29, 2026 | 8:14 AM

తమిళనాడులోని పుదుకోట జిల్లా కీరమంగళం గ్రామంలో ఉన్న ప్రభుత్వ బాలికల హయ్యర్ సెకండరీ పాఠశాల నిరుపేద కుటుంబాలకు చెందిన ఎంతోమంది అమ్మాయిలకు విద్యాబాట చూపిస్తోంది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయ కూలీలు, పశువుల కాపర్లు, ఇతర పేద కుటుంబాలే ఉండటంతో.. విద్యార్థినుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేశారు. 1996 నుంచి 2003 మధ్య ఈ పాఠశాల నుంచి సుమారు 50 మంది విద్యార్థినులు ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. 2003 నుంచి 2016 మధ్య మరో 70 మంది ఇంజినీర్లుగా ఎదిగారు. తొమ్మిది మంది వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లయ్యారు. అయితే 2017లో తమిళనాడులో వైద్య విద్య ప్రవేశాలకు నీట్ పరీక్ష తప్పనిసరి కావడంతో ఈ పాఠశాల విద్యార్థినులకు కొత్త సవాలు ఎదురైంది. నీట్ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత పేద కుటుంబాల విద్యార్థినులకు లేకపోయింది. దీంతో కొంతకాలం వైద్య విద్యలో ప్రవేశాలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితిని మార్చాలని ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు ఎస్. గుహన్, కొడియరసు, వల్లినాయకి తదితర ఉపాధ్యాయులు నిర్ణయించుకున్నారు.

2018-19 విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లారు. సాధారణ పాఠాలతో పాటు నీట్‌కు అవసరమైన ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, సమాధానాలపై శిక్షణ ఇచ్చారు. చెన్నైకి వెళ్లి విద్యార్థినుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్ తీసుకొచ్చారు. ఆ ఏడాది నీట్ రాయడానికి సిద్ధమైన ఇద్దరు విద్యార్థినులతో పాటు గతంలో పరీక్షలో విఫలమైన మరో ఇద్దరిని కోచింగ్ సెంటర్‌లో చేర్పించారు. ఒక్కో విద్యార్థినికి రూ.40 వేల చొప్పున అయ్యే ఫీజును ఉపాధ్యాయులే తమ జేబుల నుంచి చెల్లించారు. ఫలితంగా ఆ నలుగురూ నీట్‌లో విజయం సాధించి ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో పరిస్థితి కొంత నిరాశాజనకంగా మారింది. చాలామంది విద్యార్థినులు నీట్ రాయడానికి ఆసక్తి చూపలేదు. కొందరు ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరగా, మరికొందరు కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును కొనసాగించలేకపోయారు. ఇదే సమయంలో తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివిన విద్యార్థులకు వైద్య విద్యలో 7.5 శాతం రిజర్వేషన్ కల్పించింది. దీంతో ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని విద్యార్థినులకు వివరించారు.

బీఎస్సీలో చేరినవారు, చదువు మానేసినవారు సహా పది మంది విద్యార్థినుల ఇళ్లకు వెళ్లి వారిని తిరిగి నీట్ కోచింగ్‌కు ఒప్పించారు. కేవలం రెండు నెలల శిక్షణతోనే ఏడుగురు విద్యార్థినులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. వారిలో యమున, స్వాతి సహా నలుగురు విద్యార్థినులు రిజర్వేషన్ కోటా అవసరం లేకుండానే సీట్లు సాధించడం విశేషం. నీట్‌లో మరిన్ని విజయాలు సాధించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు పాఠశాలలో ప్రత్యేక లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 3,000 పుస్తకాలు, పోటీ పరీక్షలకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచారు. విద్యార్థినులకు అదనపు సమయం కేటాయించి పాఠాలు బోధించడమే కాకుండా, పరీక్షా విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. నీట్ పరీక్ష జరిగే సమయంలో విద్యార్థినులను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లే బాధ్యతను కూడా ఉపాధ్యాయులే తీసుకుంటున్నారు. ఇందుకోసం మూడు నుంచి నాలుగు వ్యాన్లను ఏర్పాటు చేసి ప్రస్తుత విద్యార్థినులతో పాటు పాత విద్యార్థినులకూ సహకరిస్తున్నారు. ఈ కృషి ఫలితంగా పాఠశాల విద్యార్థినులు ప్లస్ టూ పరీక్షల్లోనూ 100 శాతం ఉత్తీర్ణత సాధించే స్థాయికి ఎదిగారు.

ఇవి కూడా చదవండి

40 మంది విద్యార్థినులకు వైద్య విద్యలో ప్రవేశాలు

ఉపాధ్యాయుల అంకితభావం, విద్యార్థినుల కష్టానికి ఫలితంగా గత నాలుగేళ్లలో ఈ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థినులు ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. సాధారణంగా మెరుగైన కోచింగ్ సదుపాయాలు ఉన్న విద్యాసంస్థల విద్యార్థులకే ఎక్కువ అవకాశాలు లభించే పరిస్థితుల్లో.. ఓ ప్రభుత్వ పాఠశాల ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం నిజంగా అభినందనీయం. ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు గుహన్, వల్లినాయకి, కొడియరసన్‌లు వరుసగా మూడేళ్లపాటు ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందారు. పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని, సరైన ప్రోత్సాహం, పట్టుదల, మార్గదర్శకత్వం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని కీరమంగళం ప్రభుత్వ బాలికల పాఠశాల నిరూపించింది. విద్యార్థినుల భవిష్యత్తు కోసం తమ సమయం, డబ్బు, శ్రమను వెచ్చించిన ఉపాధ్యాయులు నిజమైన గురువులుగా నిలిచారు. ఒక పాఠశాల.. కొందరు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు.. ఎన్నో పేద కుటుంబాల కలలకు రెక్కలు తొడిగారు. ఈ 40 మంది విద్యార్థినుల విజయం కేవలం వైద్య విద్యలో సాధించిన ఘనత మాత్రమే కాదు.. సమాజంలో విద్య ద్వారా మార్పు తీసుకురావచ్చనే విషయానికి గొప్ప ఉదాహరణ!

Loading...
Unable to load recommendations.
Follow Us