RRB NTPC రైల్వేలో 3,548 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. డిగ్రీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం!

RRB NTPC గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నాన్‌ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్‌ (NTPC–Graduate) విభాగంలో మొత్తం 3,548 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు..

RRB NTPC రైల్వేలో 3,548 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. డిగ్రీ అర్హతతో దరఖాస్తుకు అవకాశం!
RRB NTPC Graduate Recruitment

Updated on: Oct 09, 2026 | 8:30 AM

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి RRB NTPC గ్రాడ్యుయేట్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నాన్‌ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్‌ (NTPC–Graduate) విభాగంలో మొత్తం 3,548 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 2026 అక్టోబర్ 8న ప్రారంభమై నవంబర్ 6న ముగియనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా నాలుగు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం తదితర వివరాలు ఈ కింద చెక్‌ చేయండి..

పోస్టుల వివరాలు

  • చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టుల సంఖ్య: 127
  • గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టుల సంఖ్య: 2,750
  • జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల సంఖ్య: 300
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల సంఖ్య: 371

కేటగిరీల వారీగా జనరల్‌కు 1,517, ఎస్సీకి 553, ఎస్టీకి 300, ఓబీసీ-ఎన్‌సీఎల్‌కు 873, ఈడబ్ల్యూఎస్‌కు 305 పోస్టులు కేటాయించారు.

రీజియన్ల వారీగా ఖాళీలు ఇలా..

  • అహ్మదాబాద్: 19
  • అజ్‌మేర్: 304
  • బెంగళూరు: 346
  • భోపాల్: 157
  • భువనేశ్వర్: 146
  • బిలాస్‌పూర్: 542
  • చండీగఢ్: 59
  • చెన్నై: 141
  • సికింద్రాబాద్: 56
  • గోరఖ్‌పుర్: 30
  • గువాహటి: 104
  • జమ్మూ–శ్రీనగర్: 66
  • కోల్‌కతా: 332
  • మాల్దా: 26
  • ముంబయి: 155
  • ముజఫర్‌పూర్: 78
  • పట్నా: 29
  • ప్రయాగ్‌రాజ్: 265
  • రాంచీ: 377
  • సిలిగురి: 291
  • తిరువనంతపురం: 25

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా దానికి సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి. దరఖాస్తుల చివరి తేదీ నాటికి విద్యార్హతను పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. అభ్యర్ధుల వయోపరిమితి 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, రైల్వే ఉద్యోగులు తదితరులకు నిబంధనల ప్రకారం అదనపు సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్ 6, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్క అభ్యర్థి ఒక ఆర్‌ఆర్‌బీకి మాత్రమే దరఖాస్తు చేయాలి. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు సమర్పిస్తే అవి తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్హతలు, వయోపరిమితి, పోస్టుల వివరాలు, ఇతర నిబంధనలను పరిశీలించాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు/ ట్రాన్స్‌జెండర్లు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT-1, CBT-2), ధ్రువపత్రాల పరిశీలన (డాక్యుమెంట్ వెరిఫికేషన్), వైద్య పరీక్ష ఉంటాయి. మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షలో సాధించిన నార్మలైజ్డ్ మార్కుల ఆధారంగా రెండో దశకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

రాత పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే..?

సీబీటీ 1 పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు చొప్పున ప్రశ్నలు అడుగుతారు. సీబీటీ 1లో అర్హత సాధించిన వారికి సీబీటీ 2 పరీక్ష ఉంటుంది.

సీబీటీ 2 పరీక్ష ఎలా ఉంటుందంటే..?

మొత్తం 120 ప్రశ్నలకు 120 మార్కుల చొప్పున అడుగుతారు. పరీక్ష సమయం 90 నిమిషాలు. జనరల్ అవేర్‌నెస్ విభాగం నుంచి 50 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 35 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగం నుంచి 35 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. రెండు దశల పరీక్షల్లోనూ ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రశ్నలను జాగ్రత్తగా చదివి సమాధానాలు గుర్తించాలి. సీబీటీ 1 పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నోటిఫికేషన్‌లోని నిబంధనల ప్రకారం ఫీజు రీఫండ్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ నెలకు రూ.35,400, గూడ్స్ ట్రైన్ మేనేజర్ నెలకు రూ.29,200, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ నెలకు రూ.29,200, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నెలకు రూ.29,200 చొప్పున ప్రారంభ వేతనం చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 8, 2026 నుంచి
  • దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 6, 2026.
  • ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: నవంబర్ 8, 2026.
  • దరఖాస్తుల సవరణ గడువు: నవంబర్ 9 నుంచి 18 వరకు

రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు గడువును దృష్టిలో ఉంచుకుని ముందుగానే సిద్ధం కావాలి. జనరల్ అవేర్‌నెస్, గణితం, రీజనింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ మాక్ టెస్టులు సాధన చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. అయితే దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని ఖాళీలు, అర్హతలు, ఫీజు, పరీక్షా విధానం, తేదీలను తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలి.

RRB NTPC రైల్వే గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us