JEE Advanced 2026 Toppers: ‘సోషల్ మీడియాకు గుడ్‌బై..’ జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్ల కామన్ సీక్రెట్‌ ఇదే

పరీక్షల సన్నద్ధత సమయంలో సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటమే తన విజయ రహస్యమని ‘జేఈఈ అడ్వాన్స్‌డ్‌’లో టాప్‌ 1, 2 ర్యాంకర్లుగా నిలిచిన శుభమ్‌ కుమార్‌, కబీర్‌ చిల్లార్‌ తెలిపారు. ప్రిపరేషన్ కు విద్యార్ధుల ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన కోటానే బెస్ట్ అని చెబుతున్నారు..

JEE Advanced 2026 Toppers: ‘సోషల్ మీడియాకు గుడ్‌బై..’ జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్ల కామన్ సీక్రెట్‌ ఇదే
JEE Advance toppers Shubham Kumar and Kabeer Chillar

Updated on: Jun 03, 2026 | 5:27 PM

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 ఫలితాలు గత సోమవారం (జూన్‌ 1) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో శుభమ్‌ కుమార్‌ 360 మార్కులకు గానూ 330 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ కొల్లగొట్టాడు. కేవలం ఒక్క మార్కు తేడాతో 329 మార్కులు తెచ్చుకుని కబీర్‌ చిల్లార్‌ ఆల్‌ ఇండియా సెకండ్ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. వీరిద్దరూ ఇద్దరూ కోటాలోని అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నవారే కావడం విశేషం.

రోజూ 8-10గంటలు చదువుతా.. సోషల్ మీడియాకు దూరం: శుభమ్‌ కుమార్‌

బీహార్‌లోని గయకు చెందిన శుభమ్‌ కుమార్‌ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకుతో మెరిశాడు. శుభమ్‌ తన ప్రిపరేషన్‌ స్ట్రాటజీ గురించి చెబుతూ.. రోజూ 8-10గంటలు చదివుకు కేటాయించినట్లు పేర్కొన్నాడు. విద్యార్థుల ఆత్మహత్య ఘటనల కారణంగా కోట తరచూ వార్తల్లో నిలుస్తున్నప్పటికీ.. తాను ఆ నెగెటివ్‌ వార్తలను పట్టించుకునేవాడిని కాదన్నాడు. పలు ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ప్రతి ఏటా వేలాది మంది తరలివచ్చే ఆ నగర జీవ వ్యవస్థపైనే ఆధారపడాలని నిర్ణయించుకున్నాట్లు తెలిపాడు. అలాగే తనంతట తానే సోషల్‌ మీడియా వినియోగానికి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఫోన్‌ను కేవలం తల్లిదండ్రులు, ఫ్యాకల్టీతో టచ్‌లో ఉండటానికి మాత్రమే వినియోగించినట్లు తెలిపాడు. ఈ అలవాట్లు తన విజయానికి ఎంతో ఉపకరించినట్లు తెలిపాడు. ఆదివారాల్లో మాత్రమే క్రికెట్, బ్యాడ్మింటన్ వంటి తన హాబీలలో పాల్గొంటానని అన్నాడు.

ఒత్తిడికి గురైనప్పుడు 5-10 నిమిషాలు ధ్యానం చేస్తానని, అలాగే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కూడా స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌లో చాలా సహాయపడతారని సూచించాడు. ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, పోటీతత్వం గల విద్యార్థులు ఉండే కోటా లాంటి నగరంలో మాత్రమే విజయం సాధించడం సాధ్యమవుతుందని అన్నాడు. రెండేళ్ల క్రితం 11వ తరగతిలో ఉన్నప్పుడే 18 ఏళ్ల వయసులో కోటాలో కోచింగ్‌ తీసుకోవడం ప్రారంభించానని అన్నాడు. మన లక్ష్యాన్ని సాధించాలంటే ఏదైనా చేయాలనే సంకల్ప బలం, మన అంతరాత్మ నుంచి వచ్చే ప్రేరణ మనతో ఉండాలి. నేను ప్రతి సవాలును ప్రేరణగా మార్చుకున్నాను. నా పూర్తి దృష్టి నా లక్ష్యంపైనే ఉంచానని తెలిపాడు. తాను ఐఐటీ బొంబాయిలోని సీఎస్ బ్రాంచ్‌లో బీటెక్‌లో ప్రవేశం పొందుతానని శుభమ్‌ తెలిపాడు. కాగా శుభం తండ్రి శివ కుమార్ బీహార్‌లోని గయాలో హార్డ్‌వేర్ వ్యాపారి కాగా, అతని తల్లి కంచన్ దేవి గృహిణి.

ఇవి కూడా చదవండి

చదువు విషయంలో ఎప్పుడూ ఒత్తిడికి గురికాలేదు.. కబీర్‌ చిల్లార్‌

హరిహాణాలోని గురుగ్రామ్‌కు చెందిన కబీర్‌ చిల్లార్‌ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో రెండో ర్యాంకుతో అదరగొట్టాడు. చదువు విషయంలో తాను ఎప్పుడూ ఒత్తిడికి లోనవ్వలేదని కబీర్‌ తెలిపాడు. తాను ‘మానసికంగా చాలా దృఢమైనవాడిని’ అని చెప్పుకొచ్చాడు. ఏదైనా పాఠాన్ని అవసరమైనప్పుడు గుర్తుచేసుకోగలిగేలా అర్థం చేసుకొని ఒక్కసారి చదివితే సరిపోతుందన్నాడు. ఇక టాపర్లుగా నిలిచిన శుభమ్‌, కబీర్‌ చిల్లార్‌ ఇద్దరూ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ఒక విషయాన్ని ఉమ్మడిగా పాటించారు. అది సోషల్ మీడియాకు దూరంగా ఉండటం. నేను సోషల్ మీడియాను ఎప్పుడూ ఉపయోగించను. నా దగ్గర వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ ఉన్నాయి. కానీ అవి కేవలం అధ్యాపకులు, స్నేహితులతో సబ్జెక్టుల గురించి చర్చించడానికి మాత్రమేనని అన్నాడు. తాను ఐఐటీ బొంబాయిలో కంప్యూటర్ సైన్స్ కోర్సులో చేరాలనుకుంటున్నట్లు కబీర్ అన్నాడు. ఇక కబీర్‌ తండ్రి మోహిత్‌ కూడా ఐఐటియన్‌. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి ఓ ప్రైవేటు స్కూల్‌ టీచర్‌గా పని చేస్తున్నారు.

అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ తెలిపిన డేటా ప్రకారం కోటా ఐఐటీ-జేఈఈలో ఏడుసార్లు ఆల్ ఇండియా ఫస్ట్‌ ర్యాంక్‌ను సాధించింది. గతంలో అదే సంస్థ నుంచి 2025లో రజిత్ గుప్తా, 2024లో వేద్ లహోటి AIR-1 సాధించారు. వీరికి ముందు అదే సంస్థకు చెందిన చిత్రంగ్ ముర్డియా, అమన్ బన్సల్, కార్తికేయ గుప్తా, మృదుల్ అగర్వాల్ జేఈఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచారు.

Follow Us