Jobs: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతాలు.. 2025లో ఈ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు..!

| Edited By: Janardhan Veluru

Dec 21, 2024 | 5:58 PM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ వరల్డ్లో డేటా అనలిటిక్స్ (Data Analysts) రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయి. డిమాండ్తో పాటు భారీ ప్యాకేజీల వల్ల ఈ రంగం వైపు యువత ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు. అయితే, హఠాత్తుగా ఈ రంగంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉండటంతో వివిధ కంపెనీలు సంప్రదాయ డిగ్రీ లేకపోయినా సర్టిఫికేషన్, ఆన్లైన్ కోర్సులు, శిక్షణ తీసుకున్నవారిని నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా వారికి లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నాయి.

Jobs: డిగ్రీ లేకున్నా లక్షల్లో జీతాలు.. 2025లో ఈ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు..!
Data Analyst
Follow us on

ప్రస్తుత డిజిటల్​ యుగంలో డేటా అనలిటిక్స్​ అధిక డిమాండ్​ ఉన్న రంగంగా మారింది. ఆరు అంకెల వేతనాలను(లక్షకు పైగా) అందించే  ఈ వృత్తికి సంప్రదాయ డిగ్రీ అవసరం లేదు. ప్రస్తుతం వివిధ కంపెనీల్లో ఎక్కువ నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అవసరం భారీగా ఉంది. దీంతో ఆన్​లైన్​, సర్టిఫికేషన్​ కోర్సులు, శిక్షణ పొందిన వారిని కంపెనీలు హైర్​ చేసుకుంటున్నాయి. గూగుల్​ వైస్​ ప్రెసిడెంట్​, గ్రో విత్​ గూగుల్​ ప్రోగ్రామ్​ వ్యవస్థాపకురాలు లిసా గెవెల్బర్​ కూడా ఇదే చెబుతున్నారు. “డేటాను అర్థం చేసుకుని, ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలకు మార్గనిర్దేశం చేసే వ్యక్తులకు భారీగా డిమాండ్​ ఉంది” అని ఆమె చెప్పారు.

30 శాతం అధిక అవకాశాలు

సమాజంలో ట్రెండ్​లను గుర్తించి, దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించడంలో డేటా అనలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. Excel, SQL, Tableau వంటి సాఫ్ట్​వేర్​లను ఉపోయోగించి ఈ నిపుణులు కంపెనీలను మరింత సమర్థంగా నిర్వహించడంతో పాటు విక్రయాలు, వెబ్​సైట్​ ట్రాఫిక్​ వంటి వాటిని బేరీజు వేస్తుంటారు. అమెరికాలోని బ్యూరో ఆఫ్​ లేబర్​ స్టాటిస్టిక్స్​ డేటా అనలిటిక్స్​ అండ్​ సైన్స్​ ప్రకారం డేటా అనలిటిక్స్​ సైన్స్​ ఉద్యోగాలు వచ్చే దశాబ్దంలో 30 శాతం పెరుగుతాయని అంచనా. ఇది సగటు ఉద్యోగ వృద్ధి రేటు కన్నా మూడు రెట్లు ఎక్కువ. 2024 జూన్​ అప్​వర్క్​ రిపోర్ట్​ ప్రకారం ఇటు కంపెనీలు అటు ఉద్యోగులు ఎక్కువగా కోరుకునే నైపుణ్యాల్లో డేటా అనలిటిక్స్​ నిలిచింది. దీన్ని బట్టి చూస్తే దాదాపు కంపెనీల్లో ఈ రంగం పాత్ర ఏంటో అర్థమవుతుంది.

తక్కువ ధరలకే కోర్సులు

అయితే, దాదాపు ప్రతి జాబ్​కు కనీసంగా డిగ్రీని అర్హతగా ప్రతి కంపెనీ చూస్తోంది. కానీ డేటా అనలిటిక్స్​కు వచ్చే సరికి కొత్త ట్రెండ్​ను సృష్టిస్తోంది. చాలా కంపెనీలు ఇప్పుడు హైస్కూల్​ డిప్లోమా లేదా సర్టిఫికేషన్​ ప్రోగ్రామ్​లను పూర్తి చేసిన అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఇందుకోసం గూగుల్​ కూడా కొన్ని కోర్సులను ప్రవేశపెట్టింది. గూగుల్​ డేటా అనలిటిక్స్​ సర్టిఫికేషన్​తో పాటు దాని ఇనిషియేటివ్​ గ్రో విత్​ గూగుల్​ ద్వారా నెలకు 49 డాలర్లకే కోర్సు అందుబాటులో ఉంది. ఐబీఎంతో పాటు CompTIAతో సహా ఇతర సంస్థలు కూడా శిక్షణను ఇస్తున్నాయి. ఈ కోర్సుల ద్వారా కోడింగ్​, స్ర్పెడ్​ షీట్లతో పని చేయడం, డేటాను విశ్లేషించడం వంటి అంశాలను నేర్పిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రంగంలో ఏఐ టూల్స్​తో అనుసంధానం ద్వారా ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని గెవెల్బర్​ చెబుతున్నారు.

ఏటా 85 లక్షల జీతం

ఇక జీతం విషయానికి వస్తే.. ఎంట్రీ లెవల్​ డేటా అనలిస్టులకు ఏటా 93 వేల డాలర్లు, నిపుణులకు 1.1 లక్షల డాలర్లు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రంగంలో వర్క్​ ఫ్రమ్​ హోమ్​ సౌకర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. మాన్యుఫ్యాక్చరింగ్​, హెల్త్​ కేర్​, టెక్నాలజీ, ఫైనాన్స్​ వంటి రంగాల్లో డేటా అనలిస్టులకు దాదాపు సంవత్సరానికి 1.5 లక్షల డాలర్లు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంటే దాదాపు భారత కరెన్సీలో 85 లక్షల రూపాయలు. అందుకే యువత ఎక్కువగా ఈ రంగంవైపు మొగ్గు చూపుతున్నారు. 2025 నాటికి ఈ రంగం మరింత వృద్ధి సాధిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.