AP Maths Genius Boy: వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్పేస్తా..

12 ఏళ్ల పిల్లాడు తన అసాధారణ గణిత ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. చిన్నప్పటి నుంచే సుడోకు పజిల్స్, అంకగణితంపై సాధన చేస్తూ క్యాలెండర్ గణనల్లో ప్రత్యేక నైపుణ్యం సంపాదించిన ఈ చిచ్చర పిడుగు.. ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 1 నుంచి 2 బిలియన్ సంవత్సరాల మధ్య ఉన్న ఏ తేదీకి అయినా ఏ వారం వస్తుందో క్షణాల్లో చెప్పి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ అరుదైన విజయానికి గుర్తింపుగా ఇన్‌ఫ్లూయన్సర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ బాల మేధావి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచాడు..

AP Maths Genius Boy: వందల కోట్ల సంవత్సరాలకూ.. ఏ తేదీ అడిగినా ఏ వారమో చిటికెలో చెప్పేస్తా..
Konaseema Boy Math Genius

Updated on: Jul 27, 2026 | 8:44 PM

కోనసీమ, జులై 27: చిన్న వయసులోనే అసాధారణ మేధస్సుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలుడు సచిన్. లెక్కలు కట్టడంలో కాలిక్యులేటర్‌ను తలపించే వేగం, గణాంకాలను వివరించడంలో అపూర్వ నైపుణ్యం, రూబిక్స్ క్యూబ్‌ను కేవలం కొన్ని సెకన్లలో సరిచేసే సామర్థ్యంతో అతడు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో తన అసాధారణ ప్రతిభను చాటుకుని ఇన్‌ఫ్లూయన్సర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నాడు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన సత్యవరప్రసాద్ క్యాలెండర్లకు సంబంధించిన గణాంకాలపై ప్రత్యేక పట్టు కలిగి ఉన్నారు. తండ్రి ప్రభావంతోనే కుమారుడు సచిన్‌కు కూడా చిన్నప్పటి నుంచే గణితంపై ఆసక్తి పెరిగింది. అంకెలతో ఆడుకోవడం, సంఖ్యల రహస్యాలను తెలుసుకోవడం అతనికి అలవాటైంది. ఈ ఆసక్తే తర్వాత అతడిని అసాధారణ ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దింది.

సుడోకు నుంచి సంఖ్యా సిద్ధాంతాల వరకు

సచిన్ చిన్న వయసు నుంచే సుడోకు పజిల్స్‌ను పరిష్కరిస్తూ తన మేధస్సుకు పదును పెట్టుకున్నాడు. అంకగణితంలో ప్రత్యేక సాధన చేయడంతో పాటు, తన తండ్రితో కలిసి గణిత సిద్ధాంతాలు, సంఖ్యా సిద్ధాంతాలపై చర్చలు సాగించేవాడు. ఈ సాధన ఫలితంగా గతంలో జరిగిన ఏ తేదీ అయినా, భవిష్యత్తులో వచ్చే ఏ తేదీ అయినా అది ఏ వారమో క్షణాల్లో చెప్పే నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఇటీవల జూన్ నెలలో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో సచిన్ తన అసాధారణ ప్రతిభను ప్రదర్శించాడు. 1 నుంచి 2 బిలియన్ సంవత్సరాల మధ్య ఉన్న ఏ తేదీని అడిగినా, అది ఏ వారమో క్షణాల్లో చెప్పి న్యాయనిర్ణేతలను ఆశ్చర్యపరిచాడు. ఈ అరుదైన ప్రతిభకు గుర్తింపుగా అతనికి ఇన్‌ఫ్లూయన్సర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రం లభించింది.

అందరినీ ఆశ్చర్యపరుస్తున్న బాల మేధావి

గణితంలో వేగవంతమైన లెక్కలు, క్యాలెండర్ గణనల్లో అపూర్వ ప్రతిభ, రూబిక్స్ క్యూబ్‌ను సెకన్లలో పరిష్కరించే సామర్థ్యం వంటి విశేషాలతో సచిన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ బాల మేధావి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us