ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో స్థాయికి తగిన విధంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం జరగడం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో అమ్మకాలు జరుగుతున్నా, మిగిలిన వాహనాలతో పోల్చితే తక్కువగానే ఉంటున్నాయి. దీనికి గల కారణాలను తెలుసుకుందాం. దేశంలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఇటీవల బాగా పెరిగింది. కానీ మొత్తం పాసింజర్ వాహనాల పరిమాణంతో పోల్చితే చాాలా తక్కువగానే ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ కార్ల కంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలే ఎక్కువ. కార్లు కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. వాహనాల విక్రయాలలో ఈవీలు 2023లో చైనాలో 30 శాతం, యూనైటెడ్ స్టేట్స్ లో 10 శాతం ఉన్నాయి. కానీ మన దేశంలో కేవలం ఆరు శాతం మాత్రమే కావడం గమనార్హం.
ఇటీవల వెల్లడైన ఓ నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు చార్జింగ్ అతి పెద్ద సమస్యగా మారింది. మన దేశంలో 2024 ఫిబ్రవరి నాటికి 12,146 పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. అంటే 125 ఈవీలకు కేవలం ఒక స్టేషన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే చైనాలో పది ఈవీలకు, అమెరికాలో 20 ఈవీలకు ఒక స్టేషన్ ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. దీంతో మన దేశంలో చాలామంది తమ ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ కోసం హోమ్ చార్జింగ్ సొల్యూషన్లపైనే ఆధారపడుతున్నారు. సాధారణంగా పెట్రోలు నడిచే వాహనంలో ఇంధనం పోయించుకుని రాకపోకలు సాగించవచ్చు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు పనిచేయాలంటే వాటికి చార్జింగ్ అవసరం. వీటిని చార్జింగ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. మన దేశంలో పబ్లిక్ చార్జర్లు తొందరగా లభించకపోవడం పెద్ద సమస్యగా మారింది. పరిమిత గ్రిడ్ కనెక్టివిటీ, నిర్వహణ ఆలస్యం కారణంగా కొన్ని తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి.
చార్జింగ్ విషయానికి వస్తే దేశంలో సగటు ఈవీ చార్జింగ్ సమయం 90 నుంచి 120 నిమిషాల వరకూ ఉంటుంది. అదే ప్రపంచంలోని పలు దేశాలలో ఇది 30 నుంచి 60 నిమిషాలు మాత్రమే ఉంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వాహన మార్కెట్ గా మన దేశం పేరుపొందింది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మహీంద్రా, మారుతీ సుజుకీ, జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటారు, హ్యుందాయ్, కియా తదితర కంపెనీలు వివిధ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటార్స్ దే ఆధిపత్యం. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా లాంగ్ రేంజ్ బ్యాటరీలను డెపలప్ చేయాలి. మరింత తక్కువ ధరకు ఉత్పత్తి కొనసాగించాలి. చార్జింగ్ నెట్ వర్క్ ను పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా విస్తరించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి