కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిందని అర్థం. అయితే ఆ మహాలక్ష్మి పెరిగి పెద్దదై ఉన్నత చదువులు చదవాలన్నా, ఘనంగా వివాహం జరగాలన్నా నేటి కాలంలో ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం. కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రతి తండ్రికి ఒక అద్భుతమైన వరం సుకన్య సమృద్ధి యోజన. కేవలం చిన్న పొదుపుతోనే మీ పాప బంగారు భవిష్యత్తుకు బలమైన పునాది ఎలా వేయవచ్చో తెలుసుకుందాం.

కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?
Sukanya Samriddhi Yojana Scheme Details

Updated on: May 02, 2026 | 7:38 PM

తల్లిదండ్రుల కల తమ కూతురును ఉన్నత చదువులు చదివించడం, ఘనంగా వివాహం చేయడం. అయితే పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా ఇప్పటి నుండే సరైన ప్రణాళికతో పొదుపు చేయడం చాలా అవసరం. ఆడపిల్లల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమే సుకన్య సమృద్ధి యోజన. . ఇది కేవలం ఒక సేవింగ్స్ అకౌంట్ మాత్రమే కాదు, మీ కూతురు కన్న కలలను నిజం చేసే ఒక ఆర్థిక భరోసా. అత్యధిక వడ్డీ రేటు, పన్ను మినహాయింపు వంటి ఆఫర్స్ ఉన్న ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

ఎవరు ఖాతా తెరవవచ్చు?

సుకన్య సమృద్ధి ఖాతాను పుట్టినప్పటి నుండి 10 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఎప్పుడైనా తెరవవచ్చు. తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు బాలిక పేరు మీద ఈ ఖాతాను ప్రారంభించాలి. ఒక బాలికకు ఒక ఖాతా మాత్రమే అనుమతించబడుతుంది. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెలకు ఈ ప్రయోజనం వర్తిస్తుంది. కవలలు లేదా ముగ్గురు పిల్లలు కలిగినప్పుడు ప్రత్యేక మినహాయింపులు ఉంటాయి.

పెట్టుబడి విధానం: ఎంత పొదుపు చేయాలి..?

ఇది ఒక దీర్ఘకాలిక క్రమశిక్షణతో కూడిన పొదుపు పథకం. ఇందులో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల పాటు మీరు డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. కనిష్టంగా ఏడాదికి రూ. 250 నుండి గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒకేసారి కాకుండా ఏడాదిలో మీకు వీలైనప్పుడు విడతల వారీగా కూడా డబ్బులు జమ చేసే వెసులుబాటు ఉంది.

ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్థిర-ఆదాయ పథకాలలో సుకన్య సమృద్ధి పథకానిదే పైచేయి. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై 8.2శాతం వడ్డీని అందిస్తోంది. వడ్డీని ఏటా చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. దీనివల్ల కాలం గడిచేకొద్దీ మీ పెట్టుబడి ఊహించని రీతిలో పెరుగుతుంది. ఇది మార్కెట్ హెచ్చుతగ్గులతో ముడిపడి లేనందున మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది.

మెచ్యూరిటీ – విత్‌డ్రావల్స్

ఇది దీర్ఘకాలిక లక్ష్యాల కోసం రూపొందించబడింది కాబట్టి ఇందులో 21 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఖాతా తెరిచిన 21 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ అవుతుంది. ఒకవేళ బాలికకు 18 ఏళ్లు నిండి వివాహం నిశ్చయమైతే అప్పుడు ఖాతాను క్లోజ్ చేయవచ్చు. కుతూరుకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం ఖాతాలోని బ్యాలెన్స్‌లో 50శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది.

పన్ను ప్రయోజనాలు: EEE కేటగిరీ

సుకన్య సమృద్ధి పథకం EEE కేటగిరీ కిందకు వస్తుంది. అంటే పెట్టుబడి పెట్టిన మొత్తానికి పన్ను ఉండదు. ఏటా వచ్చే వడ్డీపై పన్ను పడదు. మెచ్యూరిటీ తర్వాత తీసుకునే పూర్తి మొత్తంపై కూడా రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు.

గుర్తుంచుకోవలసిన విషయాలు

సుకన్య సమృద్ధి యోజన అనేది కేవలం పొదుపు మాత్రమే కాదు, మీ కుమార్తె భవిష్యత్తుకు ఒక భరోసా. అయితే ఇది దీర్ఘకాలిక పథకం కాబట్టి, మీకు అత్యవసరంగా కావాల్సిన డబ్బును ఇందులో పెట్టకుండా, భవిష్యత్తు లక్ష్యాల కోసం కేటాయించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం ఉత్తమం. వడ్డీ రేట్లు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది కాబట్టి తాజా రేట్లను గమనిస్తూ ఉండాలి.

Follow Us