ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన అన్ని బ్యాంకులలో ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలు అమలవుతాయి. అవి అందించే వడ్డీ రేట్లపై మాత్రం తేడాలుంటాయి. సాధారణ ఖాతాదారులకు, సీనియర్ సిటిజన్లకు, సూపర్ సీనియర్ సిటిజన్లకు వేర్వేరుగా అందజేస్తారు. ఎఫ్ డీలలో డబ్బులను ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా బ్యాంకులు అందించే వడ్డీరేట్లను ముందుగానే తెలుసుకోవాలి. మంచి వడ్డీని అందిస్తున్న నమ్మకమైన దానిలో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే ఎఫ్ డీలలో డిపాజిట్లు చాలా సురక్షితంగా ఉంటాయి. గ్యారెంటీ రిటర్న్ లతో పాటు పొదుపు ఖాతాల కంటే ఎక్కువ వడ్డీని అందిస్తాయి. ఈ పెట్టుబడికి ఆదాయపు పన్నుచట్టంలోని సెక్షన్ 80 సి కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి.
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాలపై సాధారణ పౌరులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీరేటును అందజేస్తోంది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా లో సాధారణ ఖాతాదారులకు 6.50, సీనియర్ సిటిజన్లకు 7.40 శాతం వడ్డీరేటును అమలు చేస్తున్నారు. స్టేట్ బ్యాంకులోని ఎఫ్ డీలలో ఐదేళ్ల కాలపరిమితికి రూ.8 లక్షలను డిపాజిట్ చేస్తే మెచ్యురిటీ తర్వాత సాధారణ ఖాతాదారులు రూ.11,04,336 అందుకుంటారు. అదే సమయంలో సినియర్ సిటిజన్లు రూ.11,59,958 తీసుకోవచ్చు. బ్యాంకు ఆఫ్ బరోడాలో ఐదేళ్ల కాలపరిమితిని రూ.8 లక్షలు డిపాజిట్ చేస్తే గడువు ముగిసిన తర్వాత 6.50 శాతం వడ్డీ రేటు ప్రకారం సాధారణ ఖాతాదారులు రూ.11,04,336 అందుకుంటారు. అదే సీనియర్ సిటిజన్లకైతే 7.40 వడ్డీ రేటు ప్రకారం రూ.11, 54, 279 అందిస్తారు.
దేశంలోని అనేక పెట్టుబడి మార్గాలలో ఎఫ్ డీలకే ప్రజల ఆదరణ ఎక్కువ. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్లు పెరుగుతున్నప్పటికీ ఎఫ్ డీలు అంటేనే ఆసక్తి చూపుతారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు తదితర వాటి కోసం ఎక్కువగా ఎఫ్ డీలలో డబ్బులు పెడతారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు పుట్టగానే వారిపేరు మీద ఎఫ్ డీ ఖాతాలో డబ్బులను జమ చేస్తారు. పిల్లలతో పాటు ఆ మొత్తం పెరుగుతూ, భవిష్యత్తులో అవసరాలకు పనికి వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి