ఎకరం, గుంట, సెంట్, గజం.. మీకు భూముల లెక్కలు తెలుసా..? వీటిని లైట్ తీసుకుంటే నష్టపోవడం పక్కా..
కష్టపడి సంపాదించిన డబ్బుతో సొంత జాగానో, వ్యవసాయ భూమినో కొనేటప్పుడు కొలతల లెక్కల్లో తేడా వస్తే లక్షల్లో నష్టపోవాల్సి వస్తుంది. తెలంగాణలో గుంటలు నడిస్తే, ఆంధ్రాలో సెంట్లు రాజ్యమేలుతాయి.. నగరాల్లోకి వచ్చేసరికి గజాల లెక్క మొదలవుతుంది. అసలు ఒక గుంట స్థలం ఎన్ని సెంట్లకు సమానం? ఎకరానికి ఎన్ని గజాలు వస్తాయి? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన భూమి కొలతల పక్కా లెక్కలు ఇవే..

సొంతిల్లు కట్టుకోవాలన్నా, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలన్నా లేదా వ్యవసాయ భూమి కొనాలన్నా అందరినీ ఎక్కువగా తికమక పెట్టే అంశం భూమి కొలతలు. తెలంగాణలో గుంటల లెక్కలు నడిస్తే.. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వైపు వెళ్లేసరికి అంతా సెంట్ల బాట పడుతుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలియక, సరైన అవగాహన లేక చాలామంది ప్లాట్ల కొనుగోళ్లలో గజాల లెక్క తేలి నష్టపోతుంటారు. రిజిస్ట్రేషన్ దస్త్రాల్లో ఏముంది? క్షేత్రస్థాయిలో మనకు దక్కే అసలు భూమి వైశాల్యం ఎంత? అనే వివరాలను సులభంగా అర్థం చేసుకోవడం ముఖ్యం.
దేశవ్యాప్త ప్రామాణికం.. ఎకరం లెక్కలు
భారత రెవెన్యూ వ్యవస్థలో భూమి వైశాల్యానికి ఎకరమే మూలస్తంభం. ఏ రాష్ట్రంలోనైనా ఎకరాన్ని చదరపు అడుగులు, గజాల్లోకి మారిస్తే లెక్కలు ఒకేలా ఉంటాయి..
చదరపు అడుగుల్లో: ఒక ఎకరానికి సరిగ్గా 43,560 చదరపు అడుగులు.
చదరపు గజాల్లో: ఒక ఎకరానికి 4,840 గజాలు.
తెలంగాణ రూల్.. గుంట అంటే ఎంత స్థలం?
తెలంగాణలో ఎకరాలు-గుంటల ఆధారంగా కొలుస్తారు.
- ఒక ఎకరంలో మొత్తం 40 గుంటలు ఉంటాయి.
- ఒక్క గుంట అంటే 121 చదరపు గజాలు (1,089 చదరపు అడుగులు).
- ఉదాహరణకు ఒకరు 2 గుంటల ప్లాట్ కొంటే, వారికి దక్కే నికర స్థలం 242 గజాలు
ఆంధ్రప్రదేశ్ పద్ధతి: సెంట్ల లెక్క ఎలా ఉంటుంది?
ఏపీలో దశాబ్దాలుగా సెంట్ల పద్ధతి అమల్లో ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ ఇదే కొలమానం.
- ఒక ఎకరాన్ని 100 సెంట్లుగా విభజిస్తారు.
- ఒక్క సెంట్ స్థలం అంటే 48.4 చదరపు గజాలు (435.6 చదరపు అడుగులు).
- ఎవరైనా 5 సెంట్ల భూమి కొనుగోలు చేస్తే అది 242 చదరపు గజాల విస్తీర్ణంతో సమానం.
గుంట వర్సెస్ సెంట్: ఏది పెద్దది?
చాలామంది గుంటను, సెంట్‌ను ఒకే విస్తీర్ణం అనుకుని పొరబడుతుంటారు. కానీ వాస్తవానికి గుంట అనేది సెంట్ కంటే చాలా పెద్ద కొలత.
ఒక గుంట స్థలం ఆంధ్రప్రదేశ్‌లోని 2.5 సెంట్లకు సమానం.
అంటే తెలంగాణలో 2 గుంటలు కొంటే.. అది ఏపీలో 5 సెంట్ల భూమితో సమానం అన్నమాట.
హెక్టార్ ఎప్పుడు వాడుతారు?
జాతీయ రహదారులు, భారీ సాగునీటి ప్రాజెక్టులు, అటవీ విస్తీర్ణం లెక్కించేటప్పుడు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెక్టార్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు.
1 హెక్టార్ – 2.47 ఎకరాలు.
గజాల్లో చెప్పాలంటే దాదాపు 11,960 చదరపు గజాలు.
కొనేముందు చేయాల్సిన హోమ్‌వర్క్
గజాల్లోకి మార్చుకోండి: డాక్యుమెంట్లలో గుంటలు ఉన్నా, సెంట్లు ఉన్నా వెంటనే దాన్ని చదరపు గజాల్లోకి మార్చి, ఆ ప్రాంతంలో గజం ధర ఎంత ఉందో లెక్కకట్టండి.
రికార్డు vs క్షేత్రస్థాయి: దస్తావేజుల్లో ఉన్న విస్తీర్ణం, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ప్రకారం భూమిపై ఉన్న హద్దులకు సరిపోతుందో లేదో అధికారిక సర్వేయర్ సమక్షంలో కొలవాలి.
రోడ్డు విస్తరణల మినహాయింపు: ప్లాట్ కొనేప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణ లేదా నాలా బఫర్ జోన్లలో స్థలం కోతకు గురవుతుందా అనేది స్థానిక ప్రభుత్వ సంస్థల ద్వారా ముందే నిర్ధారించుకోవడం సురక్షితం.
