AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio IPO: దేశంలో 60 శాతం డేటా ట్రాఫిక్ జియోదే.. భవిష్యత్ వ్యూహాలను వెల్లడించిన ఆకాష్ అంబానీ

Reliance Jio IPO: కేవలం రీఛార్జ్‌లు, సిమ్‌ కార్డులకే పరిమితం కాకుండా.. ప్రపంచ స్థాయి టెక్నాలజీ దిగ్గజంగా రూపాంతరం చెందింది రిలయన్స్ జియో. ఎవరిపైనా ఆధారపడకుండా సొంతంగా టెక్ స్టాక్ నిర్మించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. అక్టోబర్ 21న ప్రారంభం కానున్న రూ.30,213 కోట్ల మెగా ఐపీఓ నేపథ్యంలో చైర్మన్ ఆకాష్ అంబానీ పంచుకున్న ఆసక్తికర విశేషాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Jio IPO: దేశంలో 60 శాతం డేటా ట్రాఫిక్ జియోదే.. భవిష్యత్ వ్యూహాలను వెల్లడించిన ఆకాష్ అంబానీ
Akash Ambani On Jio Data Revolution And Future Plans
Krishna S
|

Updated on: Oct 15, 2026 | 6:23 PM

Share

టెలికాం విప్లవంతో భారత్‌ను డిజిటల్ దిగ్గజంగా నిలిపిన జియో ప్లాట్‌ఫామ్స్ టెక్నాలజీ ఆవిష్కరణల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఇప్పటివరకు భారత్‌తో పాటు విదేశాల్లో కలిపి మొత్తం 7,220 పేటెంట్ దరఖాస్తులను దాఖలు చేసినట్లు రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ ప్రకటించారు. అంతర్జాతీయ మేధో సంపత్తి సంస్థ విడుదల చేసిన పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా టాప్-20 దరఖాస్తుదారుల జాబితాలో నిలిచిన ఏకైక భారతీయ సంస్థగా జియో నిలిచిందని ఆయన గర్వంగా వెల్లడించారు. మెగా ఐపీఓ కోసం రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన మరుసటి రోజు జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆకాష్ అంబానీ.. కంపెనీ సాంకేతిక ప్రయాణం, భవిష్యత్ వ్యూహాలపై కీలక విషయాలను పంచుకున్నారు.

12 వేల మంది ఇంజినీర్లతో సొంత సాంకేతికత

విదేశీ లేదా బయటి సంస్థలపై పూర్తిగా ఆధారపడకుండా జియో తన సొంత సాంకేతిక వ్యవస్థను స్వయంగా అభివృద్ధి చేసుకుందని ఆకాష్ అంబానీ తెలిపారు. కంపెనీలో పనిచేస్తున్న 12,000 మందికి పైగా ఇంజినీర్ల బృందం ఈ వినూత్న ఆవిష్కరణలను సాకారం చేసిందన్నారు. జూన్ 30, 2026 నాటికి జియో దాఖలు చేసిన 7,220 పేటెంట్లు పరిశోధన, అభివృద్ధి రంగంలో సంస్థ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడానికే సొంత టెక్నాలజీని నిర్మించామని స్పష్టం చేశారు.

చైనా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద 5G బేస్

5G నెట్‌వర్క్ విస్తరణపై స్పందిస్తూ.. మూడేళ్ల క్రితం ప్రారంభమైన జియో 5G సేవలు శరవేగంగా విస్తరించాయని చెప్పారు. చైనా కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద 5G సబ్‌స్క్రైబర్ల బేస్ కలిగిన నెట్‌వర్క్‌గా జియో అవతరించిందని హర్షం వ్యక్తం చేశారు. దేశీయ టెలికాం రంగంలో జియో ఆధిపత్యాన్ని వివరిస్తూ.. ప్రస్తుతం భారతదేశ మొత్తం డేటా ట్రాఫిక్‌లో దాదాపు 60 శాతం వాటాను జియో నెట్‌వర్కే మోస్తోందని వెల్లడించారు.

రూ.228 నుంచి రూ.7.5కు పడిపోయిన డేటా ధర

గతంతో పోలిస్తే దేశంలో డేటా వినియోగం ఊహించని స్థాయికి పెరిగిందని ఆకాష్ అంబానీ వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి జియో వినియోగదారుడు నెలకు సగటున 43.7 జీబీ డేటాను వినియోగిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు ఒక జీబీ డేటా ధర రూ.228గా ఉండగా.. 2026 ఆర్థిక సంవత్సరం నాటికి అది ఏకంగా రూ.7.5కు తగ్గిందని, దేశంలో డేటాను ప్రతి సామాన్యుడికీ అందుబాటులోకి తెచ్చామని వివరించారు. భవిష్యత్‌లో మొబిలిటీ, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఎంటర్‌ప్రైజ్ సేవలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోకి విస్తరించడమే తమ ప్రధాన లక్ష్యాలని చెప్పారు.

అక్టోబర్ 21న మెగా ఐపీఓ ప్రారంభం

జియో ప్లాట్‌ఫామ్స్ అక్టోబర్ 14న ఐపీఓ కోసం ఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. షేరు ధర శ్రేణిని రూ.1,065 నుంచి రూ.1,119గా నిర్ణయించారు. ఈ ఐపీఓ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగియనుంది. మొత్తం 27 కోట్ల తాజా షేర్ల విక్రయం ద్వారా గరిష్ట ధర ప్రకారం రూ.30,213 కోట్లను సమీకరించేందుకు సంస్థ సిద్ధమైంది. అక్టోబర్ 28న ఈ షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.

Follow Us