భారతదేశంలో జీవిత బీమా అంటే బీమా వ్యవధి పూర్తయ్యాక మనకు ఎంత వస్తుంది? అని ఆలోచించే వారే ఎక్కువ. ప్రీమియం తక్కువ ఉన్నా సరే భారతదేశంలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల చాలా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న క్లెయిమ్ చేసే సమయంలో చేసే ఆలస్యం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆలస్యం నివారించడంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్‌పై ప్రజలను ఆకట్టుకోవడానికి ఇన్‌స్టంట్ పేమెంట్ ఆప్షన్ పెట్టారని చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఇన్‌స్టంట్ పేమెంట్ గురించి కీలక విషయాలను తెలుసుకుందాం.
కుటుంబ పెద్ద మరణించినప్పుడు కుటుంబానికి ఖర్చులను చూసుకోవడానికి తక్షణ ఆర్థిక సహాయం చాలా అవసరం. ముఖ్యంగా బీమా క్లెయిమ్ వచ్చే లోపు ప్రస్తుత ఖర్చుల మేరకు దాదాపు రూ. 1-3 లక్షల మొత్తం అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న సమయంలో ఇన్‌స్టంట్ చెల్లింపునకు అర్హత ఉన్న పాలసీను తీసుకుంటే క్లెయిమ్ చేసే ముందే కొంత సొమ్ము నామినీల అకౌంట్‌లో జమ అవుతుంది. ముఖ్యంగా ఈ సొమ్ము అంత్యక్రియల ఖర్చులు వంటి అత్యవసర ఖర్చులను కవర్ చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా పాలసీదారు త్వరిత క్లెయిమ్ ఇంటీమేషన్ ప్రయోజనాన్ని అందించే ప్లాన్‌ను ఎంచుకోవాలి. పాలసీదారు మరణించిన తర్వాత బీమా కంపెనీకి సమాచారం అందించాలి.
సమాచారం అందించిన అనంతరం ఆన్‌లైన్ డెత్ సర్టిఫికేట్, బ్యాంక్ వివరాలు, నామినీకు సంబంధించిన కేవైసీ, పాలసీ డాక్యుమెంట్‌తో సహా అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఆ తర్వాత పాలసీ ప్రకారం కుటుంబానికి రూ. 1-3 లక్షలు తక్షణమే చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని క్లెయిమ్ చెల్లింపు సమయంలో బీమా సంస్థ మొత్తం హామీ మొత్తం నుంచి తీసివేస్తారు. అంటే రూ. 1 కోటి హామీ మొత్తంలో బీమా సంస్థ రూ. 2 లక్షలను త్వరిత క్లెయిమ్ ఇంటీమేషన్ బెనిఫిట్‌గా చెల్లిస్తే చెల్లింపు సమయంలో ఆధారపడిన వారు క్లెయిమ్ యాక్సెప్ట్ అయ్యాక రూ. 98 లక్షలను పొందవచ్చు. ఈ పాలసీ ముఖ్యంగా ఎన్ఆర్ఐ పాలసీదారులకు అనువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..